40 రోజుల పసికందు కడుపులో మరో పిండం.. ఇప్పుడెలా ఉందంటే?

Update: 2022-05-30 09:30 GMT
లక్షల్లో ఒకరికి ఎదురయ్యే అనుభవమిది. చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ ఉదంతం తాజాగా బిహార్ లో వెలుగు చూసింది. కేవలం 40 రోజుల పసికందు మిగిలిన వారి మాదిరి కాకుండా కాస్త తేడాగా ఉండటం.. చిన్నారి పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండటం.. మూత్రం సరిగా పోయలేకపోవటం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

దీంతో.. వైద్యుల వద్దకు ఆ శిశువును తీసుకొచ్చారు దంపతులు. బిహార్ లోని మోతిహారీ జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్ కు తీసుకొచ్చిన ఈ శిశువుకు వైద్య పరీక్షలు జరిపి.. విస్మయానికి గురి చేసే విషయాన్ని వెల్లడించారు.

40 రోజుల పసికందు పొట్టలో మరో పిండం ఉన్నట్లుగా గుర్తించారు. చాలా అరుదుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. లక్షల్లో ఒకరికి ఇలాంటివి చోటు చేసుకుంటాయి.

వైద్య పరిభాషలో దీన్ని ఫీటస్ ఇన్ ఫెటుగా వ్యవహరిస్తారు. పొట్ట దగ్గర ఉబ్బెత్తుగా ఉండటంతో.. సిటీ స్కాన్ పరీక్షలు జరిపిన వైద్యులు ఈ అరుదైన విషయాన్ని గుర్తించారు. శిశువు కడుపులో మరో పిండం పెరిగే ఈ అరుదైన సమస్యను గుర్తించిన వైద్యులు వెంటనే అందుకు పరిష్కారాన్ని చేపట్టారు.

విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపిన వైద్యులు.. కంగారు పడొద్దని చెప్పి.. వెంటనే శస్త్రచికిత్సను చేపట్టారు. శిశువు కడుపులో ఉన్న పిండాన్ని విజయవంతంగా తొలగించారు.

ప్రస్తుతం చిన్నారి కోలుకున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి నార్మల్ కండీషన్ కు రావటంతో సదరు శిశువును ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
Tags:    

Similar News