టీపీసీసీలో మ‌రో కుంప‌టి.. ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రాలు ఇస్తున్నారుగా!

Update: 2021-06-28 06:34 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్లు మార‌డం లేదా?  వారి పంథాలో వారు ప‌య‌నిస్తూ.. పంతాల‌కు ప‌ట్టింపులకుపోయి.. పార్టీని మ‌రింత దిగ‌జార్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ప్ర‌స్తుతం టీ కాంగ్రెస్ సార‌థిగా అధిష్టానం..రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఆయ‌న ఇంకా ప‌గ్గాలు చేప‌ట్ట‌లేదు. అయితే.. ఇంత‌లోనే.. ఆయ‌న‌ను విభేదిస్తున్న కోమ‌టి రెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత మంట‌ల‌ను ర‌గిలిస్తున్నాయి. నిజానికి తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకొనే పార్టీ ..రెండు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారం అంచుల‌కు కూడా రాలేక పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పార్టీలో నెల‌కొన్నఅసంతృప్తులు, వేసిన త‌ప్ప‌ట‌డుగులు.

ఇప్పుడు కూడా అవే కొన‌సాగుతున్నాయి. క‌నీసం ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న కాంగ్రెస్ సానుభూతిప‌రుల‌కు నిరాశ‌నే మిగులుస్తున్నాయి. తాజాగా రేవంత్ ఎంపిక‌పై మాట్లాడిన కోమ‌టిరెడ్డి.. తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నిజానికి ఆయ‌న కూడా పార్టీ చీఫ్ ప‌గ్గాలు కోరుకున్నారు. సీనియ‌ర్‌కావ‌డం, తెలంగాణ ఉద్య‌మంలోనూ వాయిస్ వినిపించ‌డంతో ఆయ‌న‌కు అర్హ‌త ఉంద‌నేది వాస్త‌వం. అయితే.. ఆయ‌న‌కు వివిధ కార‌ణాల‌తోపాటు.. సీనియ‌ర్లను ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా.. ఒంటెత్తు పోక‌డ‌లు పోవ‌డం ప్ర‌ధాన అవ‌రోధంగా మారింది. ఈ లోపాల‌ను స‌రిదిద్దుకుని ఉంటే.. త‌ప్ప‌కుండా కోమ‌టిరెడ్డి నేడు చీఫ్‌గా ఎంపిక‌య్యేవారు.

అయితే.. ఈ లోపాల‌ను గుర్తించేందుకు ఆయ‌న మ‌న‌సు సిద్ధంగాలేదు. ఈ క్ర‌మంలోనే మ‌రింత వివాదాల‌కు కేంద్రంగా మారి.. పార్టీని మ‌రిన్ని క‌ష్టాల్లోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి నిమామ‌కం వెనుక టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నార‌ని.. ఆయ‌న చేసిన మంత్రాంగంతోనే రేవంత్ ఎంపిక జ‌రిగిపోయింద‌ని.. కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే.. ప‌రోక్షంగా ఆంధ్రుల పెత్త‌నం.. కాంగ్రెస్‌పై ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిప‌స్తున్నాయి. ఇది చాలు! ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌రోసారి కాంగ్రెస్‌ను తొక్కేసే అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అనుకున్న స‌మ‌యంలో వేసిన త‌ప్ప‌ట‌డుగు కూడా ఇదే అని అంటున్నారు.

ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో కాంగ్రెసస్ చేతులు క‌లిపింది. దీంతో కేసీఆర్‌.. వ్యూహం మార్చుకుని.. ఇంకా మ‌న‌మీద ఆంధ్రుల పెత్త‌న‌మేనా.. అంటూ.. ప్ర‌జ‌ల‌ను సెంటిమెంటు వైపు సునాయాసంగా న‌డిపించారు. ఫ‌లితంగా కాంగ్రెస్ చావుదెబ్బ‌తింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి.. ఇదే సెంటిమెంటు ర‌గిలే అవ‌కాశం కోమ‌టిరెడ్డి కేసీఆర్ స‌హా ప్ర‌త్య‌ర్థుల‌కు అందించార‌ని అంటున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను మున్ముందు కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని రేవంత్‌ను.. ఆంధ్రుల చేతిలో కీలుబొమ్మ‌గానో.. లేక‌.. ఆంధ్రుల పెత్త‌నానికి ఆయ‌న ఒక ఆట‌వ‌స్తువుగానో చూపించే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. కాంగ్రెస్ మ‌రింత న‌ష్ట‌పోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News