రఘురామకృష్ణం రాజు బాటలో ఇంకొక ఎంపీనా?

Update: 2020-06-25 10:10 GMT
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మూల్యం చెల్లించుకున్నారు. తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు పంపిన వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సాగనంపేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు ఆయన బాటలో మరో ఎంపీ కూడా ప్రవర్తిస్తున్నారని.. ఆయనకు కూడా మూడిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీడీపీలో టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరి.. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీచేసి గెలిచారు బల్లి దుర్గాప్రసాద్ రావు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత స్థానిక వైసీపీ నేతలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడమే ఆయనపై అసమ్మతి పెరగడానికి కారణమైంది.

తాజాగా ప్రొటోకాల్ పాటించడం లేదని వైసీపీ నేతలను, సొంత వైసీపీ పార్టీనే విమర్శించడం దుమారం రేపింది..తిరుపతి స్మార్ట్ సిటీ పనుల్లో ఇటీవల జరిగిన శంకుస్థాపనలో బల్లి దుర్గాప్రసాద్ రావు పేరును ఇంటిపేరు లేకుండా వేయడంపై ఆయన ఆగ్రహించారు. దీనివెనుక కుట్ర జరిగిందని.. కేంద్రం ఇచ్చే నిధులతో జరిగే ఈ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదని.. మీ పేర్లు ఎందుకు వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించడం పార్టీకి, ప్రభుత్వానికి అవమానకరంగా షాకింగ్ గా మారాయి.

ఇక అంతటితో ఆగకుండా ఈ శంకుస్థాపనలకు తనను పిలవలేదని బల్లి దుర్గాప్రసాద్ మండిపడ్డారు. కరోనా టైంలో ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలు బాగాలేవంటూ విమర్శించారు. పార్టీ నేతల తీరుపై ఆరోపణలు గుప్పించారు.

దీంతో చిత్తూరు ఇన్ చార్జి మంత్రి దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో ఎంపీ దుర్గాప్రసాద్ రావు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రఘురామకృష్ణం రాజును పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు కొనసాగుతుండగానే మరో ఎంపీ గళమెత్తడం వైసీపీ అధిష్టానానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది.
Tags:    

Similar News