తూగో వాసికి కొవిడ్ వైరస్.. ప్రచారంలో నిజమెంత?

Update: 2020-03-04 05:58 GMT
హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి సింగపూర్ పర్యటన భాగ్యనగరికి కొవిడ్ బెంగను తీసుకొచ్చింది. దీంతో.. 1.3 కోట్ల మంది ఉన్న మహానగరానికి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇలాంటివేళ.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. తమ రాష్ట్రంలో కొవిడ్ వైరస్ లక్షణాలు ఏమీ లేవని ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే చిత్తూరు జిల్లా తిరుపతిలో కొవిడ్ లక్షణాలతో ఒకరున్నారన్న ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో వ్యక్తికి కొవిడ్ వైరస్ సోకిందన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. దీంతో.. ఏపీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి.. ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది లెక్క తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తికి కొవిడ్ వైరస్ ఎలా సోకి ఉంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. అతగాడికి సంబంధించిన వివరాల్ని క్రాస్ చెక్ చేస్తున్న అధికారులకు కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని వాడపాలెం వాసి హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా ఇటీవల అతడు దక్షిణ కొరియాకు వెళ్లి వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన అతడు.. తాజాగా సొంతూరుకు వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో.. అతగాడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఏపీ అధికారులు వాడపాలెంలోని అతడి ఇంటిని గుర్తించారు. కాకుంటే.. అతడు లేడని.. అత్తగారిల్లు అయిన గోదశపాలెం వెళ్లినట్లుగా గుర్తించి.. అక్కడికి వెళ్లారు.

అతడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. రక్త నమూనాను హైదరాబాద్ కు ఫూణెకు పంపారు. అతడికి కరోనా (కొవిడ్) సోకిందా? లేదా? అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. అతగాడి టెస్టులకు సంబంధించిన రిజల్ట్ ఎలా వస్తుందన్న విషయంపై ఏపీ అధికారులు తీవ్రమైన టెన్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.




Tags:    

Similar News