ఏపీ సర్కారుకు మరో షాక్.. టైం బాగోలేదా?

Update: 2021-06-27 05:30 GMT
జీవో ఎప్పుడో జారీ అయ్యింది. పనులు ఎప్పుడో మొదలయ్యాయి. అలాంటిది ఉరుము మెరుపు లేని విధంగా ఏపీ సర్కారు అక్రమంగా ప్రాజెక్టును నిర్మిస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించటం తెలిసిందే. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిందన్న విషయం బయటకు వచ్చినంతనే తెలంగాణ అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు కాకుంటే మరెప్పటికి తిట్టే అవకాశం ఉండదన్నట్లుగా వారి తీరు ఉండటం గమనార్హం.

ఏపీ సర్కారు నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. మంత్రులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దివంగత మహా నేత వైఎస్ మొదలు..ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను ఘాటుగా తిట్టేస్తున్నారు. అయినప్పటికి వైసీపీ నేతలు  మాత్రం ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తున్నారే తప్పించి.. తమ సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించటం లేదు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేసే తీరును ఏపీ అధికారపక్ష నేతలు అస్సలు ప్రదర్శించటం లేదు.

ఇందుకు భిన్నంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చక్కటి వాతావరణాన్ని చెడగొట్టటం తమకు ఇష్టం లేదని.. ముఖ్యమంత్రితో పాటు ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించింది లేదు. ఇదంతాఒక ఎత్తు అయితే..అనూహ్యంగా ఏపీ సర్కారుకు షాకిచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల్ని వాయిదా వేసింది.

దీనికి సంబంధించి ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రాజెక్టు స్పష్టమైన డ్రాయింగ్స్.. లేఅవుట్ లు.. చార్ట్ లను ఇవ్వాలని ఏపీ సర్కారుకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తులో స్పష్టత మిస్ అయినట్లుగా చెబుతున్నారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎంత నీటిని వాడుకోవాలన్న సమాచారాన్ని కేంద్రం కోరింది. మొత్తానికి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఏపీ సర్కారుకు షాకులు తగులుతున్న దుస్థితి.
Tags:    

Similar News