ఏపీకి రైల్వే జోన్ ను మంగళం పలికిన మోడీ సర్కారు

Update: 2021-12-09 06:34 GMT
ఒకటి తర్వాత ఒకటిగా ఏపీకి షాకులు ఇస్తున్న మోడీ సర్కారు.. మరో షాకిచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడదు. దేశ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంటు సాక్షిగా తనకు తాను హామీ ఇచ్చిన అంశాల్ని.. ఆ తర్వాత అదే కుర్చీలో కూర్చున్న ప్రధానమంత్రి.. గతంలో తీసుకున్న నిర్ణయాల్ని తూచ్ అనేయటం చూస్తే.. ఏపీకి ఏమీ చేయకుండా ఉన్న ఆయన.. గతంలో ఇచ్చిన హామీలకు సైతం మంగళం పాడేస్తున్న వైనం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక హోదాకు గుండు సన్నా చెప్పేసిన ఆయన.. విభజన హామీల్లో కీలకమైన విశాఖకు రైల్వే జోన్ కు మంగళం పాడేశారు.

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ మాటను మర్చిపోయినట్లుగా కేంద్రం చేసిన తాజా ప్రకటన ఉంది. మోడీ సర్కార్ ఆ మధ్యన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రస్తావన లేకుండా.. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని చెప్పిన లిఖిన పూర్వక సమాధానంతో విశాఖకు రైల్వే జోన్ హామీ హుళక్కేనని తేలిపోయింది. తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

అందులో మొత్తం 17రైల్వే జోన్లు ఉన్నాయని ప్రకటించారు.

అందులో విశాఖ జోన్ కనిపించకపోవటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వారం క్రితం ఇదే మంత్రి పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కొత్తగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన దక్షణి కోస్తా జోన్ కు తాజా 2020-21 బడ్జెట్ లో రూ.40 లక్షలు కేటాయించామన్నారు.

ఈ జోన్ కు తూర్పు కోస్తా రైల్వేలోని కొత్త రాయగడ డివిజన్ తో కలిపి రూ.170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు కూడా వెల్లడించారు. 2019 ఆగస్టులోనే దీని డీపీఆర్ సమర్పించారని చెప్పిన ఆయన.. వారం తిరిగేసరికి ఆ జోన్ ప్రస్తావనే లేకుండా సమాధానం ఇవ్వటం షాకింగ్ గా మారింది.

2019లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖకు వచ్చిన ప్రధాని మోడీ.. విశాఖ రైల్వే జోన్ త్వరలోనే ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా నాటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కొత్త జోన్ కు దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా ప్రకటించారు. అలాంటిది తాజాగా అసలు ఆ జోన్ ప్రస్తావన లేకపోవటం విశేషం.

గడిచిన రెండు బడ్జెట్లలో విశాఖ జోన్ కు నిధులు కేటాయించిన కేంద్రం.. తాజాగా మాత్రం దేశంలో 17 రైల్వే జోన్లు ఉన్నాయని.. కొత్త జోన్ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైల్వే మంత్రి చెప్పిన 17 రైల్వే డివిజన్లలో విశాఖ జోన్ లేదు. ఏపీకి ఇంతకు మించిన మోసం మరొకటి లేదంటున్నారు. ఇప్పటికైనా అధికార.. విపక్షం రెండూ కలిసి మోడీ సర్కారును.. విశాఖ జోన్ మీద ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News