జగన్ సర్కారు మళ్లీ ఇరుకున పడనుందా?

Update: 2022-06-24 11:30 GMT
ఏపీలో మ‌రో స‌మ్మె సైర‌న్ మోగ‌నుంది.  మున్సిప‌ల్ ఉద్యోగులు, కార్మికులు వ‌చ్చే  నెల 11 నుంచి స‌మ్మెకు వెళ్ల‌నున్నారు అన్న‌ది నిర్థార‌ణ అవుతోంది. స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌కుండా కాల‌యాప‌న చేస్తున్న జగ‌న్ సర్కారుకు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు  సంబంధింత కార్మిక సంఘాలు మ‌రియు ఉద్యోగ సంఘాలు ఏకం అవుతున్నాయి.  ఉపాధ్యాయ వ‌ర్గాలు స‌మ్మె నుంచి మినహాయింపులోనే ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఈ మేర‌కు నిన్న‌టి వేళ మున్సిప‌ల్ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్య కార్యాచ‌ర‌ణ వేదిక స‌మావేశం అయి ఓ నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. ముఖ్యంగా జీత‌భ‌త్యాల చెల్లింపుల్లోనూ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ వ‌ర్తింపులో కూడా జాప్యం జ‌రుగుతోంద‌ని వీరంతా ఆవేద‌న చెందుతున్నారు.

2019 ఆగ‌స్టు నుంచి మున్సిప‌ల్ కార్మికుల‌కు ఇస్తున్న ఆక్యుపేష‌న‌ల్ అల‌వెన్సును నిలిపివేయ‌డం స‌రికాద‌ని వీరంతా అంటున్నారు. ఆరోగ్య భ‌త్యం బ‌కాయిల చెల్లింపున‌కు చొర‌వ తీసుకోవాల‌ని వీరంతా  కోరుతున్నారు, అదేవిధంగా పాత బ‌కాయిల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని వేడుకుంటున్నారు.

మ‌రోవైపు కొన్ని పంచాయ‌తీల విలీనం తరువాత మున్సిప‌ల్ పారిశుద్ధ కార్మికుల వేత‌నాల చెల్లింపు కూడా స‌జావుగా సాగ‌డం లేద‌ని తెలుస్తోంది. శివారు పంచాయ‌తీల విలీనానికి ప్రాధాన్యం ఇచ్చే క్ర‌మంలో ఇక్క‌డి స‌మ‌స్య‌లు ముఖ్యంగా ఉద్యోగ, కార్మిక వ‌ర్గాల  స‌మ‌స్య‌లు, జీత‌భ‌త్యాల చెల్లింపు త‌దిర‌త విష‌యాల‌నూ ప‌ట్టించుకోవ‌డం లేదు అని తెలుస్తోంది. జీతాల చెల్లింపుల్లోజాప్యం కార‌ణంగా తామంతా ప‌స్తులుండి కుటుంబాల‌ను నెట్టుకురావాల్సి వ‌స్తోందని వాపోతున్నారు.

విలీనం త‌రువాత స్థానికంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా చెత్త ప‌న్నుతో స‌హా ఆస్తి ప‌న్ను, నీటి ప‌న్నుల వ‌సూలుకు ప్రాధాన్యం ఇవ్వ‌డంతో త‌రుచూ ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

ముఖ్యంగా ఆరోగ్య భద్ర‌త, ఉద్యోగ భ‌ద్ర‌త, బీమా అన్న‌వి లేకుండా ఉద్యోగాలు చేయ‌డం క‌ష్ట‌మేన‌ని పారిశుద్ధ కార్మికులు వేద‌న చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు నిబంధన‌లు పాటించి ప‌నిచేసినా  రాజ‌కీయ ఒత్తిళ్లు అధికం అవుతున్నాయ‌ని వీరంతా వాపోతున్నారు. వీటి కార‌ణంగా త‌మ‌పై భౌతిక దాడులు కూడా జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News