ఏపీ స‌ర్కార్ ఇంకో వెయ్యి కోట్ల అప్పు.. నాలుగున్న‌ర‌ నెల‌ల్లోనే ఇంత అప్పా?

Update: 2022-08-19 05:59 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకుంటోంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా ఆగ‌స్టు 18న‌ జగన్‌ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మొత్తం 13 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా రూ.500 కోట్లపై 7.74 శాతం వడ్డీ కాగా, మరో 16 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా మరో రూ.500 కోట్ల అప్పుపై 7.72 శాతం వడ్డీ అని అంటున్నారు.

ఈ రూ.1000 కోట్ల మొత్తంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు.. 5 నెలల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెచ్చిన అప్పులు రూ.44,604 కోట్లకు చేరాయని స‌మాచారం. ఈ రూ.44604 కోట్ల‌లో ఒక్క ఆర్‌బీఐ నుంచే రూ.34 వేల కోట్లు తెచ్చార‌ని చెబుతున్నారు. ఇవి గాక నాబార్డు నుంచి రూ.40 కోట్లు, కేంద్రం నుంచి రూ.1,373 కోట్లు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.8,300 కోట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలలకుగాను రూ.43,803 కోట్ల అప్పు లు తెచ్చుకోవడానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ స‌ర్కార్‌కు అనుమతిచ్చింది. కానీ జగన్‌ ప్రభుత్వం దీన్ని కేవలం నాలుగున్నర నెలల్లోనే దాటేసింద‌ని చెబుతున్నారు. కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌) రద్దు చేయకుండా ఉంటే రూ.4,203 కోట్ల అప్పు అదనంగా తెచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీనికి అదనంగా పొలాల్లో వ్య‌వాస‌య పంపు సెట్ల‌కు స్మార్ట్‌ మీటర్లు పెట్టడం ద్వారా రూ.2,000 కోట్లు రుణం తెచ్చుకునే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించింద‌ని చెబుతున్నారు.

ఈ రూ.4,203 కోట్ల కోస‌మే జ‌గ‌న్ ప్ర‌భుత్వం సీఎపీఎస్ ర‌ద్దు విష‌యంలో ముందుకు వెళ్ల‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదేవిధంగా వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు మీట‌ర్ల వ‌ల్ల రైతుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలంగాణ‌తో స‌హా ప‌లు రాష్ట్రాలు వాటిని అమ‌ర్చడానికి నిరాక‌రించాయి. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఈ విష‌యంలో కేంద్రం చెప్పిన‌ట్టే చేస్తోంద‌ని గుర్తు చేస్తున్నారు. వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు స్మార్ట్ మీట‌ర్లు పెట్ట‌డానికి ఒప్పుకుంటే రూ.2000 కోట్లు తెచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కాగా జగన్‌ ప్రభుత్వం పరిమితికి మించి, కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు తేవడం మూడున్నరేళ్లుగా సాగుతూనే ఉంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇప్ప‌టికే తీసుకున్న అప్పులు దాచి.. ఏమార్చి కేంద్రం అనుమతి ఇచ్చిన‌దాని కంటే ఎక్కువ తెస్తున్నార‌ని అంటున్నారు.

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి ఎన్‌సీడీల జారీ ద్వారా తెచ్చిన రూ.8,300 కోట్ల అప్పును ద్రవ్య జవాబుదారీ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం)చట్టం ప్రకారం కేం ద్రం అనుమతించిన అప్పులపరిమితిలో జగన్‌ ప్రభుత్వం చూపడం లేద‌ని అంటున్నారు. తద్వారా ఇంకా రూ.8,300 కోట్ల మేర దొంగ అప్పులు తెచ్చుకునే అవకాశం సృష్టించుకుంద‌ని విమ‌ర్శిస్తున్నారు.
Tags:    

Similar News