టీడీపీలో మ‌రో బిగ్‌వికెట్ ప‌డ‌నుందా...!

Update: 2019-10-24 05:53 GMT
సాధారణ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల్లోనే టిడిపిలో వరుసపెట్టి వికెట్లు టపటపా పడుతున్నాయి.  ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ దాదాపు కనుమరగయ్యే స్థాయికి వచ్చేసింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బిజెపి లేదా వైసీపీలోకి వెళ్ళిపోయారు. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్ళగా,  మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు రాజధాని జిల్లాలకు చెందిన కీలక నేతలు సైతం టిడిపిని వీడేందుకు రెడీ అవుతున్నారు.  నిన్నమొన్నటి వరకు చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన నాయకులు ఇప్పుడు బాబు అంటేనే లైట్ తీసుకుంటున్నారు.  

తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పైకి మాత్రం ఆయన తాను టిడిపిలోనే ఉంటానని చెబుతున్న అంతర్గతంగా మాత్రం వైసీపీ లోకి వెళ్ళేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.  సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మంత్రి పదవి కూడా చేపట్టారు. అనంతర కాలంలో వైఎస్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరగవ్వడంతో వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.

రాజకీయ గురువు రాయపాటి సూచనలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కూడా పెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన తాడికొండ నుంచి పోటీ చేయాలని అనుకున్నా చంద్రబాబు ప్రతిపాడు సీటు కేటాయించగా అక్కడ ప్రస్తుతం హోంమంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఎంపీ గల్లా జయదేవ్ వర్గం ఎంపీ ఓటు మాత్రం మాకు వేసి... ఎమ్మెల్యే ఓటు మీకు నచ్చిన వాళ్లకు వేయండ‌ని చేసిన ప్రచారంతో తాను ఓడిపోయానని డొక్కా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దగ్గర కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోకపోవడంతో పార్టీపై రగిలిపోతున్నారు.  ఈ క్రమంలోనే డొక్కా వైసిపిలోకి వెళ్లిపోతారని టిడిపిలోని ఓ వర్గం కూడా ప్రచారం చేస్తోంది.  అటు వైసీపీ నేతలు కూడా బలమైన డొక్కా లాంటి బ‌ల‌మైన నేత‌ల‌ను తమ పార్టీలో చేర్చుకుంటే తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.  ఈ క్రమంలోనే డొక్కా టీడీపీలో ఉన్నా... మనసు మాత్రం మానసికంగా వైసీపీకి దగ్గరయినట్టే అని తెలుస్తోంది.
Tags:    

Similar News