రద్దీని తగ్గాలంటే మోడీ ఏం చేయాలి..?

Update: 2016-11-15 08:05 GMT
ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా వారం రోజులైంది. అయినప్పటికీ సందడి తగ్గటం తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే.. బ్యాంకుల దగ్గర యుద్ధాలు తప్పేలా లేవన్న మాట వినిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని ప్రకటన తర్వాత పాత నోట్లను బ్యాంకులకు ఇచ్చి కొత్త నోట్లను మార్చుకోవటం ఒక సమస్యగామారితే.. ఏటీఎంలు పని చేయక.. చేతిలో డబ్బుల్లేక జనాలు పడుతున్న ఇబ్బందులు అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి.

ఈ హడావుడి మూడు.. నాలుగు రోజుల అయ్యాక తగ్గిపోతుందని భావించినా.. రోజులు గడుస్తున్నకొద్దీ బ్యాంకుల వద్ద బారులు మరింతగా పెరుగుతున్నాయే తప్పించి తగ్గటం లేదు. మోడీ నిర్ణయాన్ని మొదట్లో స్వాగతించిన వారు సైతం ఇప్పుడు తప్పు పడుతున్నారు. రాజకీయ నేతలు తమ స్వరాన్ని పెంచుతున్నారు. ఇలాంటి వేళ.. మరికాస్త ఆలస్యమైతే బ్యాంకుల దగ్గర చిన్నసైజు వీధిపోరాటాలు జరగటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. మొన్నటి వరకూ ఓపిగ్గా నిరీక్షించిన ప్రజలు.. నోట్ల కష్టాలకు తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు.. ఏటీఎంలు పరిమితంగా పని చేయటం.. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవటానికి పరిమితులు ఉండటంతో.. నోట్ల కోసం కటకటలాడిపోతున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ అర్జెంట్ గా ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న అసలు సమస్య బ్యాంకుల దగ్గర క్యూలైన్లు.. ఏటీఎంలు త్వరగా ఖాళీ కావటం. ఈ రెండింటిని ఎంత తొందరగా నార్మల్ పరిస్థితికి తీసుకొస్తే అంత మంచిది. లేకుంటే ఇబ్బందులు మరింత పెరగటంతో పాటు.. జనాల్లో అసహనం పాళ్లు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది.

నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు సెట్ కావాలంటే యుద్ధప్రాతిపదికన దేశంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఏటీఎంలను గుర్తించాలి. ప్రతి రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఏటీఎంలకు ఒకట్రెండు వాహనాల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. ఖాళీ అయిన ఏటీఎంలను వెనువెంటనే నింపే ఏర్పాట్లు చేయాలి. అంతేకాదు.. ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే మొత్తాల్ని భారీగా పెంచాలి. అప్పుడే డబ్బులు దొరకవన్న సందేహం ఉండదు. ఎక్కడైనా..ఏ విషయంలో అయినా సరే.. కొరత ఉందంటే చాలు.. అవసరానికి మించి కోరుకోవటం ఉంటుంది.

విపత్తులు చోటు చేసుకున్న సమయంలో సహాయక చర్యలకు ఈ తీరే ఇబ్బందిగా మారుతుంది. కానీ.. ఒక్కసారి పరిస్థితి చక్కబడిందన్న నమ్మకం కలిగితే చాలు.. వాటి గురించి ఆలోచించటం ఉండదు. అందుకే.. బ్యాంకింగ్ సేవల కంటే కూడా.. ఏటీఎంల నుంచి ఓ మోస్తరు లిమిట్ కు (కనీసం రూ.20వేలు) పెంచేస్తూ నిర్ణయం తీసుకొని.. ఖాళీ అయ్యే ఏటీఎంలను నింపేస్తూ పోతే.. చిల్లర నోట్ల డిమాండ్ అంతకంతకూ తగ్గిపోతుంది. మరీ.. విషయాన్ని పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News