యాంటీ మోడీ పాలిటిక్స్: పీకేకు తోడుగా రంగంలోకి మమత

Update: 2021-07-16 16:31 GMT
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నది నానుడి. ఇప్పుడు తమను అస్థిరపరుస్తున్న బలమైన శత్రువును ఢీకొట్టడానికి బలహీనపడిన శత్రువును మిత్రుడిగా చేసుకుంటోంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇందుకోసం హస్తిన బాట పడుతోంది.

కేంద్రంలోనే అధికారంలో ఉన్న మోడీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓడించాలని ఓవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే అందరు ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. ఇప్పుడు పీకేకు తోడుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు మమతా బెనర్జీ ఏకంగా దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి రెడీ అయ్యారా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే అదే చెప్తున్నారు.

నరేంద్రమోడీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు బద్ధ శత్రువులైన కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలుపుతున్నట్టే ఉన్నాయి. ఈనెల 25వ తేదీన సోనియాగాంధీ-మమత భేటి జరుగబోతోందని సమాచారం.

19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాల్లో ఎన్డీఏను ఇరుకునపెట్టడానికి తృణమూల్ ఎంపీలు రెడీ అవుతున్నారు. 25వ తేదీన మమతా బెనర్జీ ఢిల్లీకి చేరుకుంటున్నారు. బీజేపీని పార్లమెంట్ లో ఎండగట్టడానికి తృణమూల్ ఎంపీలకు ఆమె దిశానిర్ధేశం చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని ఓడించేలా మమత ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోపాటు చాలా మంది ప్రతిపక్షాలకు చెందిన అధినేతలతో భేటి అవ్వడానికి మమతా బెనర్జీ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం సోనియా గాంధీ+రాహుల్ గాంధీతో భేటి అవ్వబోతున్నారు.ప్రతిపక్షాల్లో చాలా మందికి నరేంద్రమోడీయే ప్రధాన టార్గెట్. దీంతో మోడీకి వ్యతిరేకులైన వారందరినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి మమతా బెనర్జీ నడుం బిగించినట్టు తెలుస్తోంది.

మోడీపై ఇప్పటికే దేశ ప్రజల్లో, ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలో పీకల్లోతు వ్యతిరేకత ఉందని కొన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వేళ మోడీ ఫెయిల్యూర్ అయ్యాడని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మోడీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉందని మమత భావిస్తోంది.

వచ్చే ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మమత ప్రాంతీయ పార్టీలన్నింటిని కలిసేలా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీని గెలవనీయవద్దని కేజ్రీవాల్, యూపీ నేత అఖిలేష్ తో కీలక చర్చలు చేయబోతున్నారని సమాచారం.

వచ్చే ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే 2023లో కూడా బీజేపీకి నూకలు చెల్లినట్టేనని.. అందుకే వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మమతా బెనర్జీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం అయ్యారు. శరద్ పవార్ తో పలు దఫాలు చర్చలు జరిపారు.  సమావేశాల పూర్తి సమాచారం బయటకు రాకపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా బలమైన కూటమి ఏర్పాట్ల వైపు ప్రతిపక్షాలను నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ వరుస సమావేశాలు రాజకీయవర్గాల్లో బలమైన సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఏకంగా శరద్ పవార్ ను రాష్ట్రపతిగా ఎన్నికయ్యేలా చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. మమతా బెనర్జీ కూడా ఇప్పుడు ఢిల్లీకి వస్తుండడంతో పవార్ ను రాష్ట్రపతిని చేయడం.. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా వ్యూహాలు రచించబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మమత బెనర్జీ రాజకీయాలు పనిచేస్తాయా? బీజేపీని ఓడించగలవా? అన్నది మాత్రం భవిష్యత్తులోనే తేలనుంది.
Tags:    

Similar News