ప‌ద్మ పుర‌స్కారాల‌కు మీరూ సిఫార్సు చేయొచ్చు

Update: 2017-08-19 04:58 GMT
పుర‌స్కారాలు ఎన్ని ఉన్నా.. ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఉన్న విలువ‌.. వాటికున్న పేరు ప్ర‌ఖ్యాతులు వేరేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. ఇలాంటి విశిష్ఠ పుర‌స్కారాలు అందుకున్న వారికి సంబంధించి కొన్ని విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు రావ‌టం మామూలే. రాజ‌కీయ నేత‌ల‌తో సంబంధాలు.. వారికున్న ప‌రిధి మేర‌కు మాత్ర‌మే పుర‌స్కారాలు వస్తున్నాయే త‌ప్పించి.. అర్హులైన ప‌లువురికి రావ‌టం లేద‌న్న ఆరోప‌ణ ఎంతో కాలంగా ఉంది.

ప‌ద్మ పుర‌స్కారాల్ని కేంద్ర.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. ముఖ్య‌మంత్రులు.. గ‌వ‌ర్న‌ర్లు.. ఎంపీలు... కేంద్ర‌మంత్రులు సిఫార్సు చేయొచ్చు. క‌ళ‌లు.. సాహిత్యం.. విద్య‌.. వైద్యం.. క్రీడ‌లు.. సంఘ‌సేవ‌.. ఇంజినీరింగ్‌.. పౌర‌సేవ‌లు.. ప్ర‌జా వ్య‌వ‌హారాలు.. వాణిజ్యం.. ప‌రిశ్ర‌మ‌లు.. సైన్స్ అండ్ టెక్నాల‌జీ లాంటి అంశాల్లో ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించిన వారి పేర్ల‌ను ప్ర‌తిపాదించే వీలుంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇవ‌న్నీ రాజ‌కీయ నేత‌లు.. వారికున్న ప‌రిధుల‌కు అనుగుణంగా ప‌ద్మ పుర‌స్కారాల‌కు సిఫార్సులు జ‌రిగేవి. ఈ కార‌ణంగా రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండేవారు.. మారుమూల ప్రాంతాల్లోనూ..  అజ్ఞాత ప్రతిభావంతులకు  ప‌ద్మ పుర‌స్కారాల సిఫార్సుల‌కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెట్టేలా స‌రికొత్త నిర్ణ‌యాన్ని కేంద్రం తీసుకుంది.

తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. సామాన్యుడు సైతం ప‌ద్మ పుర‌స్కారాల‌కు సిఫార్సులు చేయొచ్చు.  ప్ర‌తి ఏటా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం (జ‌న‌వ‌రి 26) సంద‌ర్భంగా ప్ర‌క‌టించే ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఈ సెప్టెంబ‌రు 15 వ‌ర‌కు ఎవ‌రైనా సిఫార్సులు చేసే వీలు క‌ల్పిస్తూ మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.  ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక పోర్ట‌ల్‌ను రూపొందించారు.  www.padmaawards.gov.in ద్వారా ప్ర‌తిఒక్క‌రూ ప‌ద్మ పుర‌స్కారాల అర్హుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఇస్తూ.. సిఫార్సులు చేసే వీలు ఉంది.
Tags:    

Similar News