ఒక రాష్ట్రం.. ఒకే కోడ్‌.. ఏపీలో కొత్త విధానం

Update: 2019-01-11 06:10 GMT
ఏపీ ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ రిజిస్ట‌ర్ అయిన వాహ‌నాల్ని వ‌దిలేస్తే.. ఇక‌పై రిజిస్ట‌ర్ అయ్యే వాహ‌నాల‌కు ఒక‌టే కోడ్ మీద రిజిస్ట‌ర్ చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో అయినా జిల్లాకో కోడ్ తో వాహ‌నాల్ని రిజిస్ట‌ర్ చేస్తుంటారు. దీంతో.. ఏదైనా వాహ‌నం ఫ‌లానా జిల్లాకు చెందిన‌ద‌న్న విష‌యం ఇట్టే తెలిసిపోయేది. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అమ‌లు చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాహ‌న రిజిస్ట్రేష‌న్లు చేస్తుంటే.. తెలంగాణ‌లో మాత్రం టీఎస్ పేరుతో రిజిస్ట‌ర్ చేయ‌టం షురూ చేశారు. మొద‌ట్లో టీజీ అనుకున్నా.. త‌ర్వాత మాత్రం టీఎస్ గా ఫైన‌ల్ చేశారు. జిల్లాకు ఒక కోడ్ చొప్పున కేటాయించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ప‌రిధిలోని అదిలాబాద్‌కు ఏపీ01గా కేటాయిస్తే.. అనంత‌పురంలో రిజిస్ట‌ర్ అయ్యే వాహ‌నాల‌కు ఏపీ02 కోడ్ పేరుతో నెంబ‌ర్లు ఇచ్చేవారు.

విభ‌జ‌న త‌ర్వాత ఎవ‌రి కోడ్ వారివిగా మారింది. అయితే.. ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు అమ‌ల‌వుతున్న విధానాన్ని మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక రాష్ట్రం.. ఒక కోడ్ అన్న‌ట్లుగా వాహ‌న రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఇక‌పై ఏపీ 39 కోడ్ తో నెంబ‌ర్లు ఇవ్వ‌నున్నారు. రాష్ట్రం మొత్త‌మ్మీదా ఒకే కోడ్ మీద నెంబ‌ర్లు ఇవ్వ‌టం ద్వారా.. ఫ్యాన్సీ నెంబ‌ర్ల మీద భారీ ఆదాయాన్ని పొందే వీలు ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అనుస‌రిస్తున్న విధానంలో కొన్ని జిల్లాల్లో ఫ్యాన్సీ నెంబ‌ర్లకు పెద్ద‌గా ఆదాయం రాని పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఒకే కోడ్ కింద నెంబ‌ర్లు కేటాయిస్తుండ‌టంతో.. పెద్ద ఎత్తున ఫ్యాన్సీ నెంబ‌ర్ల‌కు డిమాండ్ ఏర్ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు.

ఏపీ 39 ఏ0001తో మొద‌ల‌య్యే సిరీస్.. అక్ష‌ర మాల క్ర‌మంలో పూర్తి చేస్తారు. అది పూర్తి అయ్యాక ఏఏతో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తారు. ప్రైవేటు వాహ‌నాల‌కు కేటాయించే సిరీస్ లో పీ.. జెడ్ అక్ష‌రాల్ని కేటాయించ‌రు. పీ సిరీస్ ను పోలీసు వాహ‌నాల‌కు.. జెడ్ సిరీస్ ను ఆర్టీసీ.. వాహ‌నాల కోసం ఉంచుతారు. ఇక‌.. ర‌వాణా వాహ‌నాల‌కు టీ నుంచి వై వ‌ర‌కూ ఉంచుతారు. ఇంగ్లిషు అక్ష‌ర మాల‌లో ఉండే ఓ అక్ష‌ర సిరీస్ ఉండ‌దు. సున్నాను పోలి ఉండే ఈ అక్ష‌రాన్ని సిరీస్ నుంచి మిన‌హాయించారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం ఉండ‌టం వ‌ల్ల రాష్ట్రం మొత్తం ఒక‌టే సిరీస్ ఉన్నా ఎవ‌రికి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని భావిస్తున్నారు.


Full View

Tags:    

Similar News