ఏపీ, టీఎస్ ఆర్టీసీల మధ్య వివాదం... ప్రైవేటు బస్సులకు వరం

Update: 2020-09-08 17:35 GMT
కరోనా విపత్తు వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల ఏపీ, తెలంగాణల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వరుస అన్ లాక్ లలో భాగంగా పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడుపుకోవచ్చంటూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, ఆయా రాష్ట్రాలు తమ పొరుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కేంద్రం చెప్పిన తీపి కబురు...ఏపీ, తెలంగాణ వాసులకు మాత్రం ఇంకా చేదు వార్తగానే మిగిలింది. బస్సులు తిప్పుకోవడానికి కేంద్రం అనుమతిచ్చినా....ఏపీ, తెలంగాణల మధ్య బస్సుల పంచాయతీ ఇంకా తేలలేదు.

విభజన చట్టం, నిబంధనలు అంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ-తెలంగాణల మధ్య బస్సులు తిప్పేందుక ససేమిరా అంటున్నాయి. అధికారులు చర్చల మీద చర్చలు జరుపుతున్నప్పటికీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య `కిలోమీటర్ల` పంచాయతీ తేలకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీంతో, స్థోమత ఉన్నవారు కార్లు, క్యాబ్ లు వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుండగా....మరికొందరు బైకులపై ఏపీలోని స్వస్థలాలకు వెళుతున్నారు. బస్సు ప్రయాణం మాత్రమే చేయాలనుకున్నవారు ఎక్కడికక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పంచాయతీ....ప్రైవేటు బస్సులకు వరంగా మారింది.

ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు తెలంగాన సర్కార్ పెట్టిన ప్రతిపాదన ఏపీ సర్కార్ కు నచ్చలేదు. తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన కిలోమీటర్ల ప్రాతిపదిక అంశంపై ఏపీ సానుకూలంగా లేదు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు 850 బస్సులు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు మరో 150 బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణలో ఆంధ్రా బస్సులు 2.60 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, ఏపీలో తెలంగాణ బస్సులు 1.60 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీంతో, ఏపీ నడుపుతున్న 2.60 లక్షల కిలోమీటర్లలో, లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. అయితే, లక్ష కిలోమీటర్లకు బదులు 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఏపీ ఆర్టీసీ అధికారులు చెప్పారు. మిగతా 50 వేల కిలోమీటర్లు తిరిగేవిధంగా ఏపీలో తెలంగాణ బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదించింది. 350 బస్సులు కొనే పరిస్థితిలో తెలంగాణ సర్కార్ లేకపోవడంతో దానికి తెలంగాణ ఆర్టీసీ అంగీకరించలేదు.

ఇలా ఏపీ, టీఎస్ ఆర్టీసీలు రొట్టె ముక్క కోసం కొట్టుకుంటుంటే...మధ్యలో వచ్చిన ప్రైవేటు బస్సులు ఆ రొట్టెముక్కను పట్టుకుపోయేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాన నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్య ఎక్కువ కనుక...ఈ రూట్ లో సర్వీసులు నడిపేందుకు ప్రైవేటు బస్సులు రెడీ అవుతున్నాయి. మామూలుగానే పండుగలు, పబ్బాలకు విపరీతంగా చార్జీలు బాదే ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు....కరోనా టైంలో కాసుల కక్కుర్తి పడకుండా ఉంటాయా? ఒకవేళ ప్రైవేటు బస్సులు రోడ్డెక్కితే టీఎస్ ఆర్టీసీ కన్నా ఏపీఎస్ ఆర్టీసీనే ఎక్కువగా నష్టపోతుంది. అంటే ఇప్పటివరకు ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగని చోట ప్రైవేటు బస్సులు తిరిగే అవకాశముంది. మరి, త్వరగా ఈ కిలోమీటర్ల పంచాయతీ తేల్చుకోకుంటే...ఇరు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు విపరీతంగా నష్టపోతాయనడంలో సందేహం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల మధ్య సత్సంబంధాలున్న నేపథ్యంలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టడంలో ఇద్దరూ ఎంత త్వరగా చొరవ తీసుకుంటే అంత మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News