ఏడుపెందుకు క‌న్నా.. మీరే ఇచ్చేయొచ్చుగా?

Update: 2019-02-23 08:51 GMT
వామ్మో.. వామ్మో.. దేశంలో మరెక్క‌డా లేని ద‌రిద్ర‌పుగొట్టు రాజ‌కీయాలన్ని ఏపీలోనే క‌నిపిస్తున్నాయి. ఏదైనా ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పార్టీల‌కు అతీతంగా నేత‌లంతా మాట్లాడ‌తారు. ఎవ‌రైనా తింగ‌రు బాప‌తు ఉండి.. అందుకు భిన్నంగా మాట్లాడితే  అత‌డి పొలిటిక‌ల్ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేస్తారు. దేశంలో మ‌రే రాష్ట్రంలో అయినా ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంది. ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప‌.

విభ‌జ‌న జ‌రిగిపోయి ఐదేళ్లు నిండిపోయి.. ఆరో ఏడాదిలోకి అడుగు పెడుతున్నప్ప‌టికి.. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌త్యేక హోదాను ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేసింది లేదు. దేశ ప్ర‌ధాని రాజ్య‌స‌భ‌లో మాట ఇస్తే.. మ‌రో కాబోయే దేశ ప్ర‌ధాని ఆ హామీని అమ‌లు చేస్తామ‌ని మా గొప్ప‌గా చెప్పి.. ప్ర‌ధాని అయ్యాక తూచ్ అనేయ‌టం ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాని ప్రాతినిధ్యం వ‌హించే పార్టీ నేత‌లు ఆయ‌న బాట‌లో న‌డుస్తూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కృష్ణ‌లో క‌లిపేందుకు సైతం వెనుకాడ‌టం లేదు.

ప్ర‌త్యేక హోదా మోడీ ఇవ్వ‌రు స‌రే. దానికి ఆయ‌న ఫిక్స్ అయ్యార‌నుకుందాం. అలాంట‌ప్పుడు వేరే ఆప్ష‌న్ చూసుకోవాల్సిందే. అలా చూసుకుంటే క‌నిపించేదే.. కాంగ్రెస్‌. తాను తీసుకున్న విభ‌జ‌న నిర్ణ‌యం కార‌ణంగా ఏపీకి న‌ష్టం జ‌రిగింద‌న్న విష‌యాన్ని గుర్తించ‌ట‌మే కాదు.. దాన్ని స‌రిదిద్దేందుకు వీలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న కాంగ్రెస్ ఇప్ప‌టికే విస్ప‌ష్టమైన హామీ ఇచ్చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేస్తామ‌ని.. ఆ విష‌యంలో మ‌రో మాట‌కు అవ‌కాశం లేద‌ని తేల్చేశారు.

బీజేపీని న‌మ్మినా.. వారికి ఎంత మ‌ద్ద‌తు ఇచ్చినా హోదా రాన‌ప్పుడు.. న‌మ్మ‌కంగా ఇస్తామ‌ని చెబుతున్న రాహుల్ ను న‌మ్మితే న‌ష్ట‌మేముంది?  తాజాగా తిరుప‌తికి వ‌చ్చిన రాహుల్.. ఎక్క‌డైతే మోడీ హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చారో.. అదే గ‌డ్డ మీద రాహుల్ విస్ప‌ష్టంగా హామీ ఇచ్చారు. తాము ప‌వ‌ర్లోకి రావ‌టం ఆల‌స్యం.. ఏపీకి హోదా ఇచ్చేస్తామ‌ని చెప్పేశారు.

ఇలాంట‌ప్పుడు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు తెల‌ప‌టం ఇష్టం లేని వారు కామ్ గా ఉండొచ్చు. కానీ.. క‌న్నా లాంటి క్యాండిడేట్లు మాత్రం రాహుల్ మోసం చేస్తారంటూ మాట్లాడుతున్న తీరు చూస్తే ఒళ్లు మండ‌క మాన‌దు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని రాహుల్ మ‌రోసారి ఏపీ ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న‌ట్లుగా ఆవేద‌న చెందుతున్న క‌న్నాకు.. నిజంగానే అంత బాధ ఉంటే.. రాష్ట్రానికి హోదాను మోడీ వారి చేత ఇప్పిస్తే స‌రిపోతుంది క‌దా.

అమ్మ పెట్టా పెట్ట‌దు.. అడ‌క్క తినానీయ‌దంటే ఇదేనేమో. ఏపీ గ‌తిని మార్చే హోదా విష‌యంలోనూ క‌న్నా చెప్పే మాట‌లు వింటే.. అస‌లు వీరు ఆంధ్రోళ్లేనా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఎందుకంటే.. ప్ర‌త్యేక హోదా కంటే ఎక్కువ‌గా ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంద‌ని చెబుతున్న క‌న్నా.. అ లెక్క‌లేవో స‌వివ‌రంగా చెప్ప‌ట‌మో.. పేప‌ర్లో భారీ యాడ్ రూపంలో చెప్పేస్తే స‌రిపోతుంది క‌దా?  ఏపీకి ప్ర‌త్యేక హోదాను అడ్డుకునేలా మాట్లాడే క‌న్నాలాంటి వారిని ఆంధ్రోళ్లు ఎలా స‌హిస్తున్నారో..?


Tags:    

Similar News