పవన్ తాజా సంకేతాలకు స్పందించని ఏపీ కమలనాథులు

Update: 2021-10-23 13:30 GMT
2019 ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్న అధినేతల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకరు. అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడుకొని ఆపార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చేశారు. అధిష్ఠానం చెప్పటంతో ఓకే అనేస్తూ బీజేపీ నేతలు.. పవన్ తో జత కట్టారు. అయితే.. ఇష్టం లేని పెళ్లి తర్వాత మెగుడు పెళ్లాల మాదిరే.. పవన్ తో పొత్తు విషయంలో ఏపీ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

పవన్ కు కష్టం వచ్చినప్పుడు ఏపీ బీజేపీ నేతలు వెంట ఉన్నది లేదు. గట్టిగా వాదన వినిపించింది లేదు. అదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని పవన్ కోరితు.. ససేమిరా అంటూ బీజేపీ నిలవటం.. దాని ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన కొద్ది కాలంగా బీజేపీకి పవన్ కు మధ్య దూరం పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఆయన దగ్గర అవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే అంతర్గతంగా చర్చలు పూర్తి అయ్యాయని.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో కలిసి జనసేన పోటీ చేయాలన్న దానిపై ఫుల్ క్లారిటీకి వచ్చేసినట్లు చెబుతున్నారు.

దీనికి బలం చేకూరేలా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి. దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పాలని వారు సవాలు విసురుతున్నారు. తమకు దూరమై.. టీడీపీకి దగ్గరవుతున్నప్పటికీ పవన్ విషయంలో ఏపీ బీజేపీ నేతలు మౌనంగా ఎందుకు ఉన్నట్లు? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. పవన్ నుంచి అధికార ప్రకటన రాకుండా తొందరపడి మాట్లాడితే అభాసుపాలు అవుతామన్న ఆలోచనతో మౌనంగా ఉన్నట్లు చెబుతారు.

ఒకవేళ రేపొద్దున నిజంగానే టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్నా.. బీజేపీ నేతలు  మాట్లాడలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనికి కారణం వారి వైపు నుంచి ఉన్న లోపాలే కారణమంటున్నారు. బీజేపీ నేతలు నోరు తెరిచి పవన్ ను విమర్శలు చేస్తే.. అందుకుస్పందనగా జనసేనాని కానీ నోరు విప్పి ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా నోరు విప్పితే ఉన్న ఇమేజ్ కూడా పోతుందన్న ఆలోచనతో వారు ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో తమ బలం ఎంతకూ పెరగని వేళ.. తొందరపడే కన్నా వెయిట్ చేయటం మంచిదన్న యోచనలోనే ఏపీ బీజేపీ నేతలు కామ్ గా ఉంటున్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News