మోడీ బాటలోనే పార్లమెంటులోకి బాబు ఎంట్రీ!

Update: 2018-04-03 09:25 GMT
మోడీని ఇమిటేట్ చేయదలచుకున్నాడో.. లేదా, మోడీ సర్కారు కు ఝలక్ ఇవ్వదలచుకుంటున్న తన ప్రయత్నానికి ఆశీస్సులు దక్కాలని కోరుకుంటున్నారో... ఇప్పుడు వేస్తున్న తొలి అడుగు.. తనకు శాశ్వతమైన ప్రాభవాన్ని వైభవాన్ని  ఈ అడుగే కట్టబెట్టాలని కోరుకుంటున్నారో.. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పార్లమెంటు సెంట్రల్ హాల్ లోకి ప్రవేశిస్తూ.. వెలుపల ఉన్న మెట్లకు వంగి నమస్కరించుకుని మరీ లోనికి వెళ్లడం.. మంగళవారం హస్తిన వేదికగా.. జరిగిన పరిణామాల్లో హైలైట్.

చంద్రబాబునాయుడు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనకు గాను ఎంట్రీ ఇచ్చారు. ప్రజలు భావిస్తున్న ప్రకారం అయితే.. భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతు తీసుకుని.. సభ జరుగుతుండగానే పోరాడితేనే పట్టించుకోని మోడీ సర్కారు... సభ ముగిసే సమయంలో.. పార్టీల నాయకులను కలిసి వారి మద్దతు తీసుకుంటే.. ఎందుకు భయపడుతుందని.. ప్రయోజనం ఉండదని అంటున్నారు.

‘చంద్రబాబునాయుడు అసలు ప్రత్యేకహోదా సాధించడమూ, విభజన హక్కుల కోసం కాదనీ.. మోడీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టి.. కేంద్రాన్ని బెదిరించాలనే ఉద్దేశంతో ఈ ట్రిప్ పెట్టుకున్నారని వాదించే వారు కూడా ఉన్నారు. పైకి మాత్రం విభజన హక్కుల పేరు చెబుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. రెండు రోజుల పాటూ ఢిల్లీలో మంత్రాంగం నడపడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నది నిజం.

చంద్రబాబు తీరు చూస్తే.. గాయం సినిమాలో తనికెళ్ల భరణిని ఉద్దేశించి కోట శ్రీనివాసరావు చెప్పే డైలాగు గుర్తొస్తుంది. ‘‘లేలేలే... నాకస్సలు పొలిటికల్ ఇంటెరెస్టే లే.. అని మస్తుగ మాటలు జెప్తవ్... కానీ బ్రెయిను మాత్రం ఖతర్నాక్ ఐడియాలు జేస్తవ్..’’ అంటాడు. జాతీయ రాజకీయాల మీద నాకస్సలు ఇంటెరెస్టే లే... అని చంద్రబాబు అంటుంటారు. కానీ.. ఇప్పుడు వాటిలోనే రెండురోజులపాటూ మునిగి తేలబోతున్నారు. అదే తమాషా!

Tags:    

Similar News