జ‌గ‌న్‌.. నాన్న బాటలో !

Update: 2021-07-15 03:04 GMT
నాయ‌కులు జ‌నాల్లో నుంచే పుడ‌తారు. నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాటేవాళ్లే జ‌నాల మ‌న‌సుల్లో కొలువుంటారు. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కులు మాత్రం కేవ‌లం ఎన్నిక‌ల‌ప్పుడే ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. త‌మ ప‌ని అయిపోగానే అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. దీంతో నేత‌ల‌పై ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తిరిగి జ‌నం జ‌నం అని క‌ల‌వ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యంతో పాటు ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వస్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌నం బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌గ‌తి భవ‌న్, ఫామ్ హౌజ్‌కే ప‌రిమిత‌మ‌వుతాడంటూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతి కాస్త త‌గ్గ‌గానే జిల్లాల ప‌ర్య‌ట‌న మొద‌లెట్టిన కేసీఆర్‌.. వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల నిర్మాణ‌ల‌ను ప్రారంభించ‌డంతో పాటు వివిధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన ఆయ‌న మ‌రోసారి త‌న వాగ్ధాటితో వాళ్ల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. వెళ్లిన చోట‌ల్లా నిధుల వ‌రాలు కురిపించారు.

ఇప్పుడు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ కూడా జిల్లాల పర్యటన చేయాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం కొంత‌కాలంగా సాగుతోంది. ఉద్రిక్త ప‌రిస్థితులు కూడా నెల‌కొన్నాయి. అయితే నేరుగా కేసీఆర్‌, జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసుకోక‌పోయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నారు.  ఆ సంగతి పక్కన పెడితే ప్రజల మధ్యనుంచే అందరికీ సమాధానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు అర్థమవుతుంది.

వైఎస్ కూడా సీఎంగా ఉన్నపుడు ప్రజల్లో బాగా తిరిగే వారు. అంతేకాదు, ప్రతిరోజూ ఇంటి వద్ద కొందరు సామాన్యులను వైఎస్ కలిసే వారు. కానీ జగన్ రెండేళ్లుగా ప్రజల మధ్యలోకి వెళ్లలేదు. ఇపుడు జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట.  అంటే నాన్న బాటలో జగన్ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. కొందరేమో అటు కేసీఆర్ మొదలుపెట్టాడు, కాబట్టి జగన్ కూడా అదేబాటలో నడుస్తున్నాడు అంటున్నారు కానీ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ముందే నిర్ణయించిన కరోనా వల్ల ఆ ఆలోచన నెరవేరలేదు.

దాదాపు ఏడాదిన్న‌ర‌గా జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం లేదు. దీనికి ప్రధాన కారణం కరోనా. అయితే, ఇపుడు ఆ పరిస్థితులు చక్కబడటంతో జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు స్పష్టంగా సమాచారం ఉంది.  గతంలో జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మ‌మం ప్రారంభం కాలేదు.  దానిని కూడా ప్రారంభించడానికి  సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాకు వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ని, అందుకు అనుగుణంగా వారానికి ఒక జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్లాన్ సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News