జగన్ కు అంత కోపం ఎందుకొచ్చింది?

Update: 2020-01-02 12:09 GMT
ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అవినీతిని తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేయటం తెలిసిందే. ప్రజలకు ఎలాంటి కష్టం ఎదురుకాకుండా అధికారులు పని చేయాలని.. ప్రభుత్వ అధికారుల అవినీతిని తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని ఆయన స్పష్టం చేశారు.

అయినప్పటికీ.. అవినీతి అధికారుల ఆట కట్టించే విషయంలో అవినీతి నిరోధక శాఖ ఆశించినంత స్థాయిలో పని చేయకపోవటంపై జగన్ తాజాగా సీరియస్ అయ్యారు. ఈ రోజు (గురువారం) ఏసీబీ పని తీరుపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు మరింత చురుగ్గా.. క్రియాశీలకంగా వ్యవహరించాలని.. కమిట్ మెంట్ తో పని చేయాలన్నారు.

అవినీతికి చెక్ పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్ వెనుక చాలామంచి కారణాలు ఉన్నాయన్న జగన్.. పని చేయటానికి లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు. ఎమ్మార్వో.. రిజిస్ట్రేషన్ .. టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో.. ఇలా ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి ఉండదకూడదని స్పష్టం చేశారు. ఏపీలో లంచం తీసుకోవటానికి భయపడే పరిస్థితి రావాలన్నారు.

సెలవులు లేకుండా పని చేయాలని.. మూడు నెలల్లో మార్పులు రావాలన్న ఆయన.. పరిస్థితిని మెరుగుపర్చేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని.. ఎలాంటి సదుపాయాలు కావాలన్న ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. మరో నెలలో సమీక్ష చేస్తానన్న ఆయన.. అప్పటిలోగా మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత క్లియర్ గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటమే కాదు.. ఏసీబీ అధికారులు పరుగులు పెట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News