ఏపీ కంప్లైంట్.. తెలంగాణ ఫైర్.. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలరచ్చ

Update: 2022-04-06 03:00 GMT
భావోద్వేగాల్ని కాసేపు పక్కన పెట్టేసి.. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడితే వచ్చే సమస్యలు ఏమిటన్న దానిపై కొందరు అప్పట్లో చర్చించేవారు. ఇలాంటి చర్చ జరిపే వారు ఏపీకి.. తెలంగాణకు వత్తాసు పలికే వారు. తెలుగు వారి క్షేమాన్ని కాంక్షించేవారు. ఇలాంటి వారు పలు అంశాల్ని సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత.. రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య జల జగడం తరచూ జరగటం ఖాయమని.. ఈ లొల్లి తెలుగు ప్రజలకు తలనొప్పిగా మారుస్తుందన్న వాదనను వినిపించేవారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తున్న వేళ.. వారు వేసిన అంచనా నిజమైందని చెప్పాలి.

పలుమార్లు రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకునే జలజగడం వాతావరణాన్ని వేడెక్కించటంతో పాటు రెండు అధికారపక్షాలు ఒకరిపై ఒకరుతీవ్ర ఆరోపణలు.. విమర్శలు చేసుకునే పరిస్థితి. ఉన్నంతలో సానుకూలంశాం ఏమంటే.. రెండు రాష్ట్రాల మధ్య నడిచే జలజగడానికి సంబంధించిన తెలుగు ప్రజలు మాత్రం అనవసరంగా రియాక్టు కాకుండా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల వాదనను వింటున్నారే తప్పించి రియాక్టు కాని పరిస్థితి. కొద్దికాలంగా ఇరిగేషన్ అంశాల మీద రెండు తెలుగు రాష్ట్రాలకు పలు అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. ఒకరిపై ఒకరు విరుచుకుపడే పరిస్థితి లేదు. తాజాగా ఆ లోటు తీరనుంది.

ఏపీ తీరును తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్  రెడ్డి తీవ్రంగా తప్పు పడుతున్నారు. దీనికి కారణం తెలంగాణ తీరుపై ఏపీ ప్రభుత్వం కేంద్రంలోని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయటమే. ఎప్పటిలానే నాగార్జున సాగర్ నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటుందని ఏపీ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. విద్యుత్ ఉత్పత్తికి అడ్డుకట్ట వేయాలని తాజా లేఖలో పేర్కొంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కృష్ణా జాలాల వినియోగంలో జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తోందన్నారు. నాగార్జున సాగర్ నీటి వినియోగంపై కేఆర్ఎంబీకి ఏపీ ఎలా ఫిర్యాదు చేస్తారన్నది ఆయన ప్రశ్న.

విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జును సాగర్ నుంచి తాము నీటిని వినియోగించడం లేదని.. ఏపీ ప్రభుత్వానివి అర్థం పర్థం లేని వాదనలుగా జగదీశ్ రెడ్డి తేల్చేశారు. జగన్ ప్రభుత్వం చీటికి మాటికి కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేయటం సరికాదన్నారు. అదే పనిగా కంప్లైంట్లు చేస్తూ ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని మరింత దిగజార్చుకుంటుందన్నది ఆయన వాదన. అయితే.. మంత్రి జగదీశ్ మాటల్ని పూర్తిగా వింటే విషయం కొంత మేర అర్థం కాక మానదు.

తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్.. మాటల మధ్యలో అసలు విషయాన్ని చెప్పేశారు. పవర్ గ్రిడ్ లను కాపాడుకోవటానికి కొన్నిసార్లు సాగర్ నీటిని వినియోగిస్తున్నామని.. కాకుంటే అది ఐదు.. పది నిమిషాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇలా విద్యుత్ ఉత్పత్తి చేయటం సహజమన్న జగదీశ్ మాటల్ని విన్న వారంతా.. అసలు విషయం ఇదా? అంటూ తమకు క్లారిటీ వచ్చిందంటున్నారు.

తాము చేసిన పని గురించి చెప్పిన జగదీశ్.. ఏపీ సైతం అక్రమంగా నీటిని వినియోగిస్తూ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎందుకు.. విద్యుత్ ప్రాజెక్టుల వద్దకు మీడియాను తీసుకెళ్లి.. ఏపీ చేస్తున్న అక్రమాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తే సరిపోతుంది కదా? అన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి మంత్రి జగదీశ్ ఎలా రియాక్టు అవుతారో?
Tags:    

Similar News