ఏపీ కాంగ్రెస్ పంచాంగ శ్రవణంలో ‘అలజడి’ మాట

Update: 2016-04-09 06:07 GMT
ఉగాది సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయటం సంప్రదాయంగా వస్తున్నదే. గతంలో  కాస్త కుడి ఏడంగా ఈ శ్రవణం సాగితే.. గడిచిన కొన్నేళ్లుగా అందుకు భిన్నంగా ఎవరి శ్రవణం వారిదన్నట్లుగా మారింది. ఎవరు ఏర్పాటు చేసుకున్న శ్రవణం వారికి కాలం కలిసి వస్తుందన్న మాట చెప్పటం కనిపిస్తుంది. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే.. విభజన కారణంగా పాతాళంలోకి కూరుకుపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీ గురించి ఉగాది శ్రవణంలో పండితులు ఏం చెబుతున్నారన్నది ఆసక్తికరమే.

మిగిలిన వారి మాదిరి ధీమాగా చెప్పలేని పరిస్థితి. విభజన జరిగి.. కొత్త ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తి అయినా.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఏపీ ప్రజల ఆగ్రహం ఇసుమంతైనా తగ్గలేదు. వాస్తవం ఇలా ఉన్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం ఏ తీరులో సాగిందన్నది ఆసక్తికరమనే చెప్పాలి. హైదరాబాద్ లోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది శ్రవణంలో.. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో కాస్త మెరుగుపడే అవకాశం ఉందని మాత్రమే చెప్పగలిగారు. అంతకుమించి ఎలాంటి అంచనాలు వ్యక్తం చేయలేదు. అయితే.. ఈ అక్టోబరు.. నవంబరులలో మాత్రం బాబు సర్కారులో ‘అలజడి’ చోటు చేసుకునే వీలుందని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం ఆశించినంతగా జరగదన్న మాటను చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఏపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న మాటను చెప్పటంతో పాటు మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అధికారపార్టీపై వచ్చిన వ్యతిరేకతను ప్రతి పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేంతలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ తప్పుల్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీకి కాల సర్ప దోషం ఉందని.. జనవరితో అది తొలుగుతుందన్నారు. మొదట్లో వర్షాలు తక్కువగా పడినా.. ఆగస్టులో మాత్రం అవసరమైనన్ని వర్షాలు పడటం ఖాయమని చెప్పారు. మొత్తంగా చూస్తే.. రానున్న ఏడాది కాలంలో ఏపీలో కాంగ్రెస్ ఏమీ చేయలేదన్న విషయాన్ని వారి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం స్పష్టం చేయటం గమనార్హం. మిగిలిన పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాలతో పోలిస్తే.. ఏపీ కాంగ్రెస్ వారి పంచాంగ శ్రవణం కాస్త కొత్తగా అనిపించట్లేదు..?
Tags:    

Similar News