సెలెక్ట్ క‌మిటీకి బిల్లు పోయింది కానీ..ఆ ప‌ని జ‌ర‌గ‌ద‌ట‌!

Update: 2020-01-24 11:40 GMT
రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఏపీ శాస‌న‌స‌మండ‌లి కేంద్రంగా అనేక ట్విస్టులు ఎదుర్కొని ఎట్ట‌కేల‌కు సెలెక్ట్ క‌మిటీ గుమ్మం చేరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదన్న వైసీపీ వ్యూహం విఫలమ‌వ‌గా... పంపించాల‌న్న ప్ర‌తిప‌క్ష టీడీపీ లెక్క ఫ‌లించింది. ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ వికేంద్రీకరణ - సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనిపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. అయితే, తాజా చైర్మ‌న్‌ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపకుండా శాయశక్తులా ప్రయత్నించింది. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించి బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టింది. అయితే, ఈ బిల్లు - సెలెక్ట్ కమిటీకి పంపించిన ప్ర‌క్రియ విష‌యంలో తాజాగా చైర్మ‌న్ స్పందించారు. తనకున్న విచక్షణాధికారాలతో బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపించిన‌ట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు.  బిల్లులో తప్పుల గురించి ప్రతిపక్ష సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని, దీంతో తప్పులు ఉన్న అంశాన్ని స‌రిదిద్దేందుకు సెలక్ట్ కమిటీకి పంపించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. పొరపాట్లు జరిగాయని టీడీపీ సభ్యులు చెప్పడంతో తాను స్పందించి రూల్ 154 కింద సెలక్ట్ కమిటీకి పంపించానని క్లారిటీ ఇచ్చారు.

అయితే, చైర్మ‌న్ నిర్ణ‌యంపై వైసీపీ మండిప‌డింది. రాజ‌ధాని వికేంద్రీకరణ - సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంప‌డంలో ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిబంద‌న‌లు ఉల్లంఘించార‌ని ఆరోపించింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసిన వైసీపీ - ఒకవేళ సెలక్ట్ కమిటీకి పంపించాలన్న శాసనసభలో తీర్మానం చేయాలనే విష‌యాన్ని చైర్మ‌న్ తుంగ‌లో తొక్కార‌ని మండిప‌డింది. బిల్లును డివిజన్ పద్దతిలో ఓటింగ్ కూడా నిర్వహించలేదని - ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని - ఈరోజు ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే కంటే ఘోరమైన రోజని అభిప్రాయపడింది. టీడీపీ అన్ని విలువలకు తిలోదకాలిచ్చిందని, టీడీపీ అధినేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్ ను ఇన్ ఫ్లుయెన్స్ చేశారని వైసీపీ మంత్రులు ఆరోపించారు. టీడీపీ నేతలంతా ఛైర్మన్ షరీఫ్ పై ఒత్తిడి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండ‌గా, సెలెక్ట్ క‌మిటీ ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది.


Tags:    

Similar News