అప్పుల్లో ర్యాంకులు : ఏపీ వెంటే తెలంగాణా అంట...

Update: 2022-07-26 03:47 GMT
అప్పు చేసిన వాడు గొప్పేనోయ్ అన్నది ఒక ముతక సామెత. అప్పు ఎంత ఉంటే అంత పలుకుబడి ఉన్నట్లుగా చెబుతారు. అది నిజమే కదా ఏ బీమా మరే ధీమా లేకుండా అప్పు ఎవరిస్తారు.

అంటే ఎంతో కొంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లే కదా. అలాంటి స్థితిని ఉభయ తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు సాధించేశారు. ఎవరు గొప్ప అంటే ఇపుడప్పుడే చెప్పలేం కానీ అప్పు మీద ఒట్టేసి చెబితే మాత్రం ఇద్దరూ ఇద్దరే అని స్థూలంగా ఒక అభిప్రాయానికి రావచ్చేమో

అటు కేసీయార్ తెలంగాణా సీఎం, ఇటు జగన్ ఏపీ సీఎం. ఇద్దరూ మేమే గ్రేటెస్ట్ అనుకుంటారు. మా పాలన సూపర్ అని కూడా భావిస్తారు. వందిమాగధులు అటూ ఇటూ కూడా తెగ ఊదరగొడతారు. అయితే ఎవరెంత అప్పుల అప్పారావులో మాత్రం కేంద్రం ర్యాంకులు ఇచ్చి మరీ తాజాగా తేల్చేసింది.

ఈ ర్యాంకుల్లో ఇప్పటికైతే పై చేయి ఏపీదే అయినా వెనకాతలే రేసులోకి దూసుకువ‌స్తున్న ఘనత మాత్రం కేసీయార్ దే. ఇంతకీ కేంద్రం చెప్పిన లెక్క ఏంటి, ఏపీకి ఉన్న అప్పేంత, తెలంగాణా లెక్క ఎంత అంతే చాలానే కధ ఉంది మరి. 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 3.6 లక్షల కోట్లు ఉంటే 2022 మార్చి 31 నాటికి ఆ అప్పు కాస్తా 3.98 లక్షల కోట్లకు ఎగబాకింది.

ఇక తెలంగాణాను తీసుకుంటే 2021 మార్చి 31 నాటికి 2.67 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అదే 2022 మార్చి 31 నాటికి 3.12 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే తెలంగాణా కంటే ఏపీ అప్పు 86 లక్షల కోట్లు మాత్రం  ఎక్కువే అన్న మాట.

మరి దీన్ని ఎవరు అధిగమిస్తారో ఎవరు ముందుకు దూసుకుపోతారో చూడాల్సిందే. ఏది ఏమైనా అప్పుల్లో కూడా మేమే ముందుంటామని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు దేశానికి రుజువు చేసి చూపిస్తున్నారు అన్న మాట.
Tags:    

Similar News