ఆ చాన‌ల్ సంగ‌తి తేలుస్తామంటున్న ఏపీ డీజీపీ

Update: 2017-07-08 15:24 GMT
మాదిగల కురుక్షేత్ర సభ వివాదాస్ప‌ద రీతిలో ముగిసిన నేప‌థ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. మాదిగల కురుక్షేత్ర సభకు అనుమ‌తి ఇవ్వకపోయినప్ప‌టికీ ఇచ్చినట్లు ప్రజలలో అపోహలు కల్గించారని డీజీపీ అన్నారు. నిషేధ ఆజ్ఞలను ఉల్లగిస్తూ ఎమ్మార్పీఎస్ కార్య‌కర్తలను రెచ్చగొట్టారని అన్నారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలు రావడాన్ని గుర్తించి ముందస్తు అరెస్ట్ లు చేశామ‌ని తెలిపారు. పొలాల్లో నుంచి మూకుమ్మడిగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారి రోడ్ పై కి చేరుకున్నారని, అక్కడున్న పోలీస్ వాహనాన్ని తగలబెట్టారని డీజీపీ తెలిపారు. నేషనల్ హైవే మీద ఉన్న ఫెన్సింగ్‌ను కూడా విరగకొట్టారని తెలిపారు. ఈ సంఘటనలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి పై చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆస్తులు ధ్వంసం చేసే విధంగా కార్యకర్తలను ఎమ్మార్పీఎస్ రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని డీజీపీ సాంబ‌శివ‌రావు అన్నారు. కార్యకర్తలకు ఎంత సర్దిచెప్పినా  వినలేదని, ప్ర‌జ‌లు ఇబ్బంది పడేవిధంగా వ్యవహరించారని అన్నారు. విద్యార్థులు ఇటు వంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని అన్నారు. ఒక ఛానల్ అవాస్తవాలను ప్రచారం చేసిందని మండిప‌డ్డారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్త చనిపోయాడంటూ అసత్య ప్రచారాలు చేశారని తెలిపారు. వాస్తవాలు వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామ‌ని డీజీపీ ప్ర‌క‌టించారు. మందకృష్ణ మాదిగపై 12 కేసులు నమోదుచేశామ‌ని వెళ్ల‌డించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని కోరారు. లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.

కాగా, తునిలో విధ్వంసకాండకు పాల్పడిన కాపు రిజ‌ర్వేష‌న్ల స‌మితి నాయ‌కుడు ముద్రగడ ప‌ద్మ‌నాభం త్వ‌ర‌లో త‌ల‌పెట్టిన‌ పాదయాత్రకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని డీజీపీ అన్నారు. ముద్రగడ ఇంతవరకు అనుమతి కోరలేదని డీజీపీ సాంబశివరావు చెప్పారు. తుని విధ్వంసం కేసులో వచ్చే వారంలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.
Tags:    

Similar News