జీతాన్ని అడుక్కోవాల్సిందేనట.. మంత్రుల ఇళ్లల్లో కుక్కలకు పెట్ట బిస్కెట్లు ఖర్చు ఆ లెక్కలోనే

Update: 2021-10-10 05:50 GMT
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామచంద్రారెడ్డి ఈ మధ్యన ఫోన్ చేసి మరీ ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు.. బొప్పరాజు వెంకటేశ్వర్లను హెచ్చరించినట్లుగా పేర్కొంటూ వీడియోలు వైరల్ కావటం తెలిసిందే. రెండు పెద్ద ఉద్యోగ సంఘాలు కలిసి కట్టుగా పెట్టిన ప్రెస్ మీట్ వేళలోనే ఇది చోటు చేసుకోవటం.. దీంతో ప్రభుత్వం పైనా.. ఉద్యోగ సంఘాల నేతల మీదా ఒత్తిడి పెరిగింది. ఇలాంటివేళ.. ప్రభుత్వం తీరును కాసింత ఘాటుగా తప్పు పడుతూ.. ఈ ఇద్దరు ఉద్యోగ సంఘాల నేతలు తాజాగామరో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్ సీ.. కరవు భత్యం బకాయిల గురించి అడగటం తర్వాత.. పదో తేదీ వచ్చినా రాని జీతాలు.. పెన్షన్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న తీవ్రవ్యాఖ్య చేశారు. బకాయిల సంగతి దేవుడెరుగు.. జీతమో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది. ''పెద్ద వయస్కులకు.. దివ్యాంగులకు మా చేతులతో ఫించన్లు ఇప్పిస్తున్నారు. మాకేమో జీతాల్లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకుసబబు? పదో తేదీ వచ్చినా పింఛన్ల.. జీతాలు అందని వారు ఉన్నారు. వీటిపై ఆర్థిక శాఖ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సచివాలయానికి వెళితే ఆర్థిక మంత్రి బుగ్గన.. అధికారులు కనిపించట్లేదు. మంత్రుల ఇళ్లల్లో కుక్కలకు పెట్టే బిస్కెట్లకు అయ్యే ఖర్చును ఉద్యోగుల బడ్జెట్ నుంచి కేటాయిస్తున్నారు'' అని మండిపడ్డారు.

దసరా కానుకగా 11వ పీఆర్ సీని ప్రకటించాలని.. డీఏతో సహా బకాయిలన్నీసంక్రాంతి లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని.. ఉద్యోగులు ఇక ఆగే పరిస్థితి లేదన్నారు. ఇన్నాళ్లు వేర్వేరుగా పోరాడిన తాము కలిసి పోరాడితే ఎలా ఉంటుందో చూపిస్తామని.. సమస్యల్ని పరిష్కరించకుంటే ఉద్యమాని సిద్ధమంటూ హెచ్చరిక చేశారు.

''ఎంపీలు.. ఎమ్మెల్యేల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? వాటితో పోలిస్తే మాకు ఇచ్చేది ఎక్కువేం కాదు. ఆర్థిక అంశాలతో పాటు ఆర్థికేతరమైనవీ పరిష్కారం కావట్లేదని.. వైద్య ఆరోగ్య శాఖలో 70 మందికి పదోన్నతులు కల్పించాలి. సీఎం ఆదేశించినా అధికారులు పట్టించుకోవటం లేదు. పీఆర్ సీ కోసం 39 నెలలుగా ఎదురుచూస్తున్నాం. దసరా సందర్భంగా ఇంటికి అల్లుడ్ని తీసుకొస్తే కొత్త బట్టలు కాదు కదా భోజనం కూడా పెట్టలేని పరిస్థితి పెన్షనర్లకు ఎదురవుతోంది'' అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. మరి.. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News