సమ్మెకు రెడీ అవుతున్న ఏపీ ఉద్యోగులు

Update: 2022-01-20 05:08 GMT
పీఆర్సీపై అలకబూనిన ఏపీ ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మెు నోటీసులు అందించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమయ్యారు.

పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కొత్త పీఆర్సీ వద్దే వద్దు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని.. కార్యచరణేనంటూ  కుండబద్దలు కొట్టారు. 2022 జనవరి 19వ తేదీ బుధవారం ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు.

ఈనెల 21వ తేదీన ఏపీ జేఏసీ తరుఫున సమ్మె నోటీసు ఇస్తామని.. తమకు కొత్త పీఆర్సీ వద్దని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్దం చెబుతున్నారని.. మూడు జీవోలను బేషరతుగా రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించారని కామెంట్స్ చేశారు. దీనివల్ల ప్రతి ఉద్యోగికి రూ.6వేల నుంచి రూ.7వేల వరకూ ఉద్యోగి జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందన్నారు.

వచ్చేనెల 7వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణను ఏపీ ఎన్జీవోలు రూపొందించారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈసీ మీటింగ్ లో ఏపీ ఎన్జీవో సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఎన్జీవోల నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతామని ఇతర ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  మరి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News