బీజేపీలోకి ఏపీ మాజీ సీఎం

Update: 2019-07-06 10:42 GMT
తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసిన బీజేపీ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను, మాజీ ఎమ్మెల్యేను చేర్చుకున్న ఆ పార్టీ ఇక సీనియర్లు, ఫేడవుట్ లీడర్లు ఎవరొచ్చినా కూడా చేర్చుకుంటోంది. ఏ పార్టీలోనూ స్థానం లేకుండా ఉన్న నాయకులు కూడా ఇదే అవకాశంగా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి, 1980 దశకంలో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల 1978లో తొలిసారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినప్పుడు, ఆయనతో కలిసి నడిచిన నాదెండ్ల, ఆ మరుసటి సంవత్సరం ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపేసి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన సీఎంగా ఉన్నారు. ఆపై పదవి దిగిన తరువాత, 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్ధాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

నాదెండ్ల కుమారుడు మనోహర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి స్పీకరుగా పనిచేశారు. రాష్ట్ర విబజన తరువాత ఆయన ఇటీవల జనసేన పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన జనసేన పార్టీలోనూ చురుగ్గా కనిపించడం లేదు. తండ్రి చేరిక అనంతరం ఆయన కూడా బీజేపీలో చేరుతారని వినిపిస్తోంది.
Tags:    

Similar News