ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన..!

Update: 2022-06-03 05:29 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయాలపై గైడ్ లైన్స్ జారీ చేస్తూ జగన్ సర్కారు కీలక ప్రకటన చేసింది.

ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలకు నోడల్ ఏజెన్సీగా ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు (ఏపీఎఫ్డీసీ) సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇకపై అన్ని థియేటర్లు మరియు ప్రైవేట్ సంస్థలు ఈ నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే సినిమా టికెట్ల అమ్మకాలు చేపట్టాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రతీ టికెట్ పై 2 శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లలో ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు పక్కాగా చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇందు కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ థియేటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. కొత్త సినిమాకు వారం రోజుల ముందు మాత్రమే టిక్కెట్లు విక్రయించాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల్లోగా అన్ని థియేటర్లలో ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని థియేటర్ల లైసెన్సులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు.

కాగా, ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొస్తూ 2021 డిసెంబర్ 17న ప్రభుత్వం జీవో నెం. 142 జారీ చేసింది. టికెట్‌ ధరల నియంత్రణతో పాటుగా బ్లాక్‌ టికెట్ల దందాకు చెక్‌ పెట్టడానికే ఈ గేట్ వే ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో సేవలను అందించడం తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. గతంలో మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖలతో సమావేశం అనంతరం ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే అమలయ్యేలా ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించారు.

ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన ధరలను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లో అమలు చేయాలని.. అందుకు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మద్దతు తెలిపారు. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టుకు వెళ్ళింది. దీన్ని విచారించిన న్యాయస్థానం.. ఏపీ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గౌడ్ లైన్స్ జారీ చేసింది. ఇకపోతే దీని నిర్వహణ బాధ్యతను జస్ట్ టికెట్ సంస్థకు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News