సర్కారు ఎవ్వరినీ వదలడం లేదే !

Update: 2019-06-27 11:14 GMT
అక్రమ కట్టడాలపై జగన్ సర్కారు వేగం తగ్గలేదు. ప్రజా సంక్షేమం, పరిపాలన వంటి అన్ని విషయాల్లో చాలా వేగంగా స్పందిస్తున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే కారణంగా అమరావతిలోని ప్రజావేదికను ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. కరకట్ట మీదున్న ఇతర భవనాలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇది కేవలం అమరావతితోనే ఆగలేదు. ఇతర జిల్లాల్లోనూ అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది.

గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం జోన్‌-2 పరిధిలోని ఎంవీపీ సెక్టార్‌-11లో అనుమతి లేకుండా నిర్మించిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ ను కూల్చేశారు. ఇది టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌ కు చెందిన భవనం. ఇక్కడ వెయ్యి గజాల స్థలంలో ప్లాన్‌ లేకుండా కొంతకాలం కిందట షెడ్‌ ఏర్పాటుచేసి అందులో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌ నడుపుతున్నారు. దీనికి అనుమతి లేకపోవడంతో జోన్‌-2 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తొలగించారు.

తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత- ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని కూడా కూలగొట్టారు. జోన్‌-1 పరిధిలో గల భీమిలిలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంప్‌ కార్యాలయం అనుమతి లేకుండా కట్టినదే. అయితే, ఇంతకాలం అధికారంలో ఉండటం వల్ల దాని జోలికి వెళ్లడానికి అధికారులు భయపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడంతో వారు అనుమతి లేని ఈ భవనాన్ని కూలగొట్టారు.
జోన్‌-2 పరిధిలోనే ద్వారకానగర్‌ లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ కు చెందిన భవనం కూడా ప్రణాళికలకు విరుద్ధంగా ఉన్నట్టు అధికారులు తేల్చారు. దీనిని రేపో మాపో కూలగొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    

Tags:    

Similar News