ఆయ‌నిది స్మార్ట్ సిటీ! ఈయ‌న‌ది గ్రీన్ సిటీ! సాధ్య‌మా!

Update: 2022-06-07 05:32 GMT
సంప‌ద సృష్టికి ప్రాధాన్యం ఇస్తూ.. ముఖ్య పెద్ద న‌గ‌రాల‌ను, వాటితో పాటే చిన్న ప‌ట్ట‌ణాల‌ను కూడా  స్మార్ట్  సిటీల పేరిట  అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పించారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్రబాబు. వీటిలో భాగంగా కొన్ని న‌గ‌రాల‌ను ఎంపిక‌చేశారు. విజ‌య‌వాడ, క‌ర్నూలు, తిరుప‌తితో పాటే శ్రీ‌కాకుళం లాంటి ఓ మోస్త‌రు ప‌ట్ట‌ణాల‌నూ ఎంపిక చేసి కొంత అభివృద్ధి చేశారు. ఇందుకు కేంద్రం కూడా ప‌ట్ట‌ణ, న‌గ‌రీక‌ర‌ణ ప‌థ‌కాలలో భాగంగా కొన్ని నిధులు ఇచ్చింది. ముఖ్యంగా విద్యుద్దీక‌ర‌ణ ప‌నులకు సాయం చేసింది.

గ్రామ‌గ్రామాన విద్యుత్ పొదుపున‌కూ ప్రాధాన్యం ఇస్తూ ఎల్ఈడీ దీపాల‌నూ ఇచ్చింది. అలానే స్మార్ట్ సిటీల‌కు కొన్ని నిధులు ఇచ్చి స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ను అమ‌లు చేసేందుకు సాయం చేసింది. దాంతో  కొంత మేర అభివృద్ధి ఆ రోజు క‌నిపించింది. ప్ర‌భుత్వం మారాక స్వ‌చ్ఛ ఆంధ్ర పేరు కాస్త క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా క్లాప్ గా మారిపోయి ప‌థ‌కంకు నిధుల కేటాయింపు జ‌రుగుతోంది.

అదేవిధంగా కేంద్రం య‌థావిధిగా కొన్ని నిధులు న‌గరీక‌ర‌ణ‌కు ఇస్తున్నా స్మార్ట్ సిటీల అభివృద్ధి ఊసులు అయి తే ఇప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారులో వినిపించేలా లేవు అన్న విమ‌ర్శ ఉంది. ఎందుకంటే నిధుల‌న్నీ సంక్షేమానికే వెచ్చిస్తున్నారు.

క్లాప్ అమ‌లు చేస్తున్నా వాహ‌నాలు కొనుగోలు కు నిధులు వెచ్చించాం అన్న సాకుతో  చెత్త ప‌న్ను పేరిట సొమ్ములు వసూలు చేస్తున్నారు. అయినా కూడా ప‌నులు మాత్రం పెద్ద‌గా సాగడంలేదు. చెత్త రీ సైక్లింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్న దాఖ‌లాలు లేవు అని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న‌న్న హ‌రిత న‌గ‌రాల‌కు ఇవాళ శ్రీ‌కారం దిద్ద‌నున్నారు. న‌గ‌రాల‌ను హ‌రిత న‌గ‌రాలుగా చేయాల‌న్న ఆలోచన‌తో ఈ ప‌నులు చేప‌ట్టనున్నామని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌ల్నాడు జిల్లా, కొండ‌వీడులో ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను, న‌మూనాను సీఎం జ‌గ‌న్ ప్రారంభించి, సంబంధిత చ‌ర్య‌ల‌కు ఓ ఆచ‌ర‌ణ రూపం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టిదాకా ఇటువంటి ప‌నులు కొన్ని ప్ర‌భుత్వాలు చేసినా అవేవీ పెద్ద‌గా ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. ముఖ్యంగా న‌గ‌రీక‌ర‌ణ‌లో ప‌చ్చ‌ద‌నం శాతం రోజురోజుకూ త‌గ్గిపోతున్న త‌రుణాన గ్రీన‌రీని పెంచేందుకు జ‌గ‌న్ తీసుకునే చ‌ర్య‌లు ఏ మేరకు ఫ‌లితం ఇవ్వ‌నున్నాయి అన్న‌ది ఓ ఆస‌క్తిదాయ‌క విష‌యం.
Tags:    

Similar News