ఏపీలో సైబ‌ర్ నేరాల‌కు బ్రేక్‌.. సైబ‌ర్ మిత్ర నెంబ‌ర్ ఇదే

Update: 2019-07-26 11:19 GMT
క్ష‌ణ‌క్ష‌ణానికి మారిపోతోన్న ఆధునిక ప‌రిజ్ఞానం నేప‌థ్యంలో రోజు రోజుకు సైబ‌ర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వీటికి అడ్డుక‌ట్ట వేసేందుకు పోలీసులు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా ఈ సైబ‌ర్ నేరాల‌కు బ‌ల‌య్యే మ‌హిళ‌లు త‌మ బాధ‌ను ఎవ్వ‌రికి చెప్పుకోలేక త‌మ‌లో తామే బాధ‌ను అనుభ‌విస్తూ ఉంటారు. ఇప్పుడు వీటికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సైబ‌ర్ మిత్ర యాప్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

శుక్ర‌వారం హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌- డీపీజీ గౌత‌మ్ స‌వాంగ్ ఈ యాప్ ప్రారంభించారు. సుచ‌రిత మాట్లాడుతూ సోషల్ మీడియా ఎక్కువగా వాడే మహిళలు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని చెప్పారు. చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే భ‌య‌ప‌డుతుంటార‌ని.. వాళ్ల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు... వారి వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టి మహిళల‌ను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని సుచరిత తెలిపారు.

ప్ర‌స్తుత కాలంలో మన శత్రువు మన అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ఉన్నాడ‌ని... మనం తెలియకుండా చేసిన పొరపాట్లే మన పాలిట విలన్లుగా మారుతున్నాయని ఆమె చెప్పారు. ఇక డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ మాట్లాడుతూ సైబ‌ర్ నేరాల‌కే కాకుండా అన్ని ర‌కాల నేరాల‌కు మ‌హిళ‌లు పోలీస్‌ స్టేష‌న్‌ కు రాకుండా కంప్లైంట్ చేస్తే కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో మ‌హిళ‌లు, పిల్ల‌లను సైబ‌ర్ నేరాల నుంచి కాపాడ‌డానికి ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు.

ఇక సైబ‌ర్ మిత్ర పేరుతో ఫేస్‌ బుక్ ప్రారంభించిన పోలీస్ శాఖ... సైబర్ నేరాల కంప్లైంట్ల కోసం వాట్సాప్ ప్రారంభించింది. 9121211100 నెంబరుకు సైబర్ నేరాలపై కంప్లైంట్లని వాట్సాప్ చేసే వెసులుబాటు క‌ల్పించారు.




    
    
    

Tags:    

Similar News