మనీ ట్రాన్స్ ఫర్... అభివృద్ధి కాదు వైసీపీ ఎమ్మెల్యేలూ...

Update: 2022-11-17 08:37 GMT
వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే ఏపీలో తమ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి అన్నది పెద్దగా లేదని. ముందు ఆ విషయంలో వారికి ఒక స్పష్టత వస్తే ఆ మీదట వారు జనాల్లోకి వెళ్ళినపుడు ఏం మాట్లాడినా ఒక పద్ధతిగా విధానపరంగా విషయాలు  ఉంటాయి. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి విషయంలో పొరపడుతున్నారో భ్రమపడుతున్నారో లేక తాము ప్రస్తుతం చేస్తున్నదే అభివృద్ధిగా భావిస్తున్నారో తెలియడంలేదు.

ఈ విషయంలో వారికి ఏమైనా కన్ ఫ్యూషన్ ఉంటే కనుక వెంటనే వారు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్లారిటీకి కూడా రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. నిజానికి అభివృద్ది అన్నది శాశ్వతం. అది కనుక ఏ ప్రభుత్వం అయినా చేసి ఉంటే జనాలే వాటి గురించి చెబుతారు. ఆ ప్రభుత్వానికి పార్టీకి వారే అంబాసిడర్లుగా మారి విపరీతమైన ప్రచారం చేస్తారు. అందునా ఇది సోషల్ మీడియా యుగం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ వాడూ ఒక జర్నలిస్టే. ఒక విశ్లేషకుడే. ఒక విమర్శకుడే. అందువల్ల వారికీ అన్నీ తెలుసు.

ప్రజా చైతన్యం బాగా పెరిగిన ఈ తరుణంలో వారిని మరిపించో ఏమరపాటుకు గురి చేసో తాము చెప్పేదే నిజమని అది తాము తాము గట్టిగా నమ్మి జనాలను నమ్మించాలని చూడడం కంటే భ్రమలు వేరొకటి ఉండవు. ఏపీలో అభివృద్ధి లేదు అన్నది కళ్ళు లేని కబోధికి కూడా అర్ధమవుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ డబ్బా కొట్టుకుంటూ తాము ఎంతో చేశామని చెపుకోవడమే చిత్రంగా ఉంది అని అంటున్నారు.

ఏపీలో మూడున్నరేళ్ల కాలంలో ఒక పని మాత్రం నిరాటంకంగా సాగుతోంది. అదేంటి అంటే నగదు బదిలీ పధకం. పధకాలు ఏవైనా డబ్బులు తెచ్చి ఆయా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారు. దీని వల్ల ఆయా లబ్దిదారుడి కుటుంబాలు చక్కగా వెలుగొందుతున్నాయని భావిస్తున్నారు. తాము చేస్తున్న ఈ రకమైన కార్యక్రమాల వల్ల అభ్యివృద్ధి అన్నది ఎక్కడికో పరుగులు తీస్తోంది అని కూడా భ్రమిస్తున్నారు.

కానీ అందరూ తెలుసుకోవాల్సి విషయం ఏంటి అంటే సంక్షేమం ఎపుడూ అభివృద్ధి కానే కాదు, అభివృద్ధి అంటే జనాలందరికీ ఉపయోగపడే కార్యక్రమం. అభివృద్ధికి అందరూ లబ్దిదార్లే ఉంటారు. వారికి తేడా ఉండదు. అందరూ దాన్ని అనుభవిస్తారు. అదే నగదు బదిలీ పేరిట చేసేది ఆ రోజుకు ఆ వేళకు వారికి ఎంతో కొంత ముట్టచెప్పడమే.

దాని వల్ల ఎప్పటికీ లబ్దిదారులు అలాగే ఉండిపోతారు. ఎప్పటికీ వారు ఎదురుచూపులు చూస్తూనే ఉంటారు. కానీ అభివృద్ధి పేరిట ఒక వూరికి రోడ్డు వేసినా లేక పాఠశాల తెచ్చినా లేక ఒక పరిశ్రమ ఏర్పాటు చేయించినా అది తరువాత తరాలకు కూడా ఉపయోపడి ఎవరూ పధకాల మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉంటుంది.

గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధికే పెద్ద పీట వేసేవి. పాత బడ్జెట్లను ఒక్కసారి తిరగేస్తే మొత్తం బడ్జెట్ లో సంక్షేమానికి కేవలం అయిదు నుంచి పది శాతం లోపు మాత్రమే కేటాయింపులు ఉండేవి. మిగిలిన తొంబై శాతం బడ్జెట్ అంతా అభివృద్ధి మీదనే ఖర్చు పెట్టేవారు. అందుకే ఈనాటికి ఆ అభివృద్ధి ఫలాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక ఆర్ధిక వ్యవస్థలో ఉత్పాదక రంగం, అనుత్పాక రంగం అని రెండు ఉంటాయి. ఉత్పాదక రంగానికి చేసిన ఖర్చు ఏదో నాటికి తిరిగి వస్తుంది.

దానికి అప్పులు తీసుకున్నా అవి తీరిపోతాయి. అనుత్పాదక రంగానికి పెట్టే ఖర్చు ఎపుడూ వెనక్కి తిరిగి రాదు. దాన్ని ఎకనామిక్స్ లో డెడ్ క్యాపిటల్ అని అంటారు. ఏపీలో చూస్తే మూడున్నరేళ్ళుగా చేస్తునది. అధికంగా పెడుతున్నది డెడ్ క్యాపిటల్ గానే చూస్తున్నారు ఆర్ధిక నిపుణులు.

అలాగని సంక్షేమం అన్ని ఎవరూ ఆపమని చెప్పడంలేదు, దానితో పాటుగా అభివృద్ధికి కూడా బాటలు వేయాలి. ఆ విషయం అధినాయకత్వానికి చెప్పడానికి వత్తిడి చేయడానికి ముందు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా అన్న కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి అభివృద్ధికి నగదు బదిలీకి తేడా తెలిసిన నాడే ఏపీకి నవోదయం అని అంటున్నారు మేధావులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News