తెలంగాణ‌లో 90 శాతం ప‌ది ఉత్తీర్ణ‌త‌పై ఏపీ ప్ర‌భుత్వం ఏమంటుందో!

Update: 2022-07-01 06:30 GMT
ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలో గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో అతి త‌క్కువ ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. గ‌త 22 ఏళ్ల‌లో లేనంత‌గా అతి త‌క్కువ‌గా 67 శాతం ఉత్తీర్ణ‌త మాత్ర‌మే న‌మోదు కావ‌డంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుప‌ట్టించ‌డం వ‌ల్లే ఇలాంటి నిరాశ‌జ‌న‌క ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని నిప్పులు చెరిగాయి.

ఏపీలో రెండు ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తిలో త‌ప్పారు. ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఏపీ ప్ర‌భుత్వం.. గ‌త రెండేళ్లు క‌రోనాతో త‌ర‌గతులు స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని.. స్కూళ్లు మూత‌ప‌డ్డాయ‌ని, పిల్ల‌లు దారిలో ప‌డ‌టానికి స‌మ‌యం ప‌ట్టింద‌ని.. అందుకే ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో నిరాశ‌జ‌న‌క ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు తెలంగాణ‌లో జూన్ 30న వెలువ‌డిన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఏకంగా 90 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. గతేడాది 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదుకాగా 2020లో 99.99 శాతం, 2019లో 92.43 శాతం, 2018లో 83.77 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వంలో తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణ‌త శాతం 90 శాతంగా న‌మోదు కావ‌డంపై ఏం చెబుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

కరోనాతో పాఠ‌శాలలు మూత‌ప‌డ్డాయ‌ని, త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌లేద‌ని అందువ‌ల్లే ఉత్తీర్ణ‌త శాతం 67 మాత్ర‌మే వ‌చ్చింద‌ని ఏపీ ప్ర‌భుత్వం చెప్పింద‌ని గుర్తు చేస్తున్నాయి. మ‌రి ఇదే కోవిడ్ తెలంగాణ‌లో కూడా ఉంద‌ని, అక్క‌డ కూడా గ‌త రెండేళ్లు పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయ‌ని, ఆఫ్‌లైన్ త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నాయి.

మ‌రి ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఏకంగా 90 శాతం ఉత్తీర్ణ‌త ఎలా న‌మోదు అయ్యిందో ఏపీ ప్ర‌భుత్వం చెప్పాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. తెలంగాణ‌లో ఐదు లక్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తే కేవ‌లం 50 వేల మంది మాత్ర‌మే త‌ప్పార‌ని గుర్తు చేస్తున్నాయి.

ఏపీలో ప‌దో త‌ర‌గతిలో రెండు ల‌క్ష‌ల మందికిపైగా విద్యార్థులు త‌ప్పార‌ని చెబుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అస్త‌వ్య‌స్త విధానాల వ‌ల్లే ఏపీలో ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణ‌త‌శాతం 67కు ప‌డిపోయింద‌ని నిప్పులు చెరుగుతున్నాయి.
Tags:    

Similar News