థ‌ర్డ్ వేవ్ అల‌ర్ట్ః ఏపీ స‌ర్కారు క‌ఠిన ఆదేశాలు!

Update: 2021-08-01 05:31 GMT
దేశంలో థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. భ‌య‌ప‌డిన‌ట్టుగానే.. కొవిడ్‌ థర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. భార‌త్ లోని ప‌లు జిల్లాలో పాజిటివిటీరేటు పెరుగుతుండ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. సెకండ్ వేవ్ క‌ల్లోలం నేప‌థ్యంలో.. ఈ సారి కేంద్రం ముందుగానే అల‌ర్ట్ అయ్యింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న రాస్ట్రాల‌ను, వాటి ప‌రిధిలోని జిల్లాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఈ జిల్లాల్లో పెరుగుతున్న‌ కేసుల వేగం చూస్తే.. థ‌ర్డ్ త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు నిపుణులు. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ముంద‌స్తుగానే అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్రం హెచ్చ‌రించిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. దీంతో.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ రావ‌డం అనేది క‌న్ఫామ్ అని ముందు నుంచీ ప‌లువురు నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన వ్యాఖ్యానాలు చేస్తూ వ‌చ్చారు. కొంద‌రు పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని చెప్ప‌గా.. మ‌రికొంద‌రు గ‌ట్టి ఎఫెక్టే ఉంటుంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు థ‌ర్డ్ వేవ్ రానేరాదు అని కూడా అన్నారు. ఆగ‌స్టు నాటికి వేగం పుంజుకుంటుంద‌ని, ఆగ‌స్టు అర్ధ‌భాగం త‌రువాత కేసుల సంఖ్య‌లో మ‌రింత వేగం పెరుగుతుంద‌ని అంచ‌నా వేశారు. సెప్టెంబ‌ర్ నాటికి గ‌రిష్ఠ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ రిపోర్టు కూడా వెల్ల‌డించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకున్న‌ప్పుడు థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు ఉధృతి రేటు 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. భార‌త దేశానికి వ‌చ్చే స‌రికి ఇది మ‌రింత పెరుగుతుంద‌ని, అక్టోబ‌ర్ - న‌వంబ‌ర్ నెల‌ల్లో పీక్ స్టేజ్ కు చేరుకుంటుంద‌ని ప్ర‌భుత్వ ప్యానెల్ శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. సెకండ్ వేవ్ తో పోలిస్తే రోజూవారి గ‌రిష్ట కేసులు స‌గం త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేశారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుంటే మాత్రం.. ప‌రిస్థితి మ‌రింత ఉధృతం కావొచ్చ‌ని చెప్పారు.

తాజాగా ప‌రిస్థితి చూస్తుంటే.. వీళ్లు చెప్పిన‌ట్టుగానే జ‌రుగుతోందనే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది. మొత్తం ప‌ది రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్న‌ట్టు కేంద్రం గుర్తించింది. అందులో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఒడిషా, మేఘాల‌య‌, మిజోరాం, అసోం, మ‌ణిపూర్‌, ఏపీ రాష్ట్రాలు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీచేసింది. దాంతోపాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగ‌వంతం చేయాల‌ని సూచించింది.

ఈ రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల మ‌రింత ఎక్కువ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో కొంత త‌క్కువ‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో.. హై రిస్క్ ఉన్న ప్రాంతాలుగా మొత్తం దేశంలోని 46 జిల్లాల‌ను గుర్తించింది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు ప‌ది శాతానికి పైగా ఉంద‌ని వెల్ల‌డించింది. మ‌రో 53 జిల్లాల‌ను కూడా గుర్తించి, ఇక్క‌డ ఐదు నుంచి 10 శాతానికి మ‌ధ్య‌లో పాజిటివిటీ రేటు ఉంద‌ని ప్ర‌క‌టించింది. కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించిన ఈ 46 జిల్లాల్లో దాదాపు 80 శాతం రోగులు హోం ఐసోలేష‌న్లోనే ఉన్నార‌ని, వీరంతా బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌ని, త‌ద్వారా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవాల‌ని సూచించింది.

దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠిన‌గా అమ‌లు చేయాల‌ని ఆదేశిస్తూనే.. కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ప్ర‌జ‌లు ఎవ‌రైనా మాస్క్ లేకుండా రోడ్డెక్కితే ఫైన్ చెల్లించాల్సి వ‌స్తుంది. మాస్కు లేకుండా ఎవ‌రైనా క‌నిపిస్తే.. 100 రూపాయ‌లు ఫైన్ విధించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక, వ్యాపార స‌ముదాయాలు, సంస్థ‌లు, ఆఫీసులను సైతం హెచ్చ‌రించింది. మాస్కు లేని వారిని ఈ చోట్ల‌కు అనుమ‌తిస్తే.. 10 వేల రూపాయ‌ల నుంచి 25 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఫైన్ విధిస్తామ‌ని హెచ్చ‌రించింది. అంతేకాదు. రెండు రోజుల వ‌ర‌కూ వాటిని మూసేస్తామ‌ని ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News