రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదం !

Update: 2020-07-31 11:30 GMT
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని వికేంద్రీకరణబిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువచ్చింది. దీన్ని ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అయితే, మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత మూడు నెలలుకి మళ్లీ అదే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపించింది. అక్కడ మళ్లీ ఈ బిల్లులపై ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ, నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌ కు పంపింది.

దీనితో ఈ బిల్లుల పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కోర్టుల్లో ఎదురుదెబ్బ తింటూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఓ మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. ఎవరు అడ్డుకున్న కొద్దిగా లేటు అవుతుంది. కానీ , మూడు రాజధానులు ఏర్పాటు కావడం ఆపలేరు అంటూ వైసీపీ నేతలు మొదటి నుండి చెప్తూనే వస్తున్నారు. దానికి తగ్గట్టే ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటుకి లైన్ క్లియర్ అయింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది.

ఇక సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది కూడా ప్రభుత్వానికి మరో మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. ఈ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపడంతో జగన్ సర్కార్ కి భారీ ఊరట లభించింది. సీఆర్డీఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులకు పాత చట్టం అడ్డుగా ఉంటూ వస్తుంది. ఆ చట్టంలో నిబంధనలను అనుకూలంగా తీసుకుని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్డీఏ కూడా రద్దు కావడంతో జగన్ ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకు సాగడానికి ఇప్పుడు సులభతరం అవుతుంది. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వానికి ఇదొక బూస్ట్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.
Tags:    

Similar News