ఆ మూడు బిల్లులను గవర్నర్ ఆమోదిస్తారా?

Update: 2020-07-19 10:50 GMT
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుపై మళ్లీ వేడి మొదలైంది. ఈ బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం.. ఆమోదించవద్దని టీడీపీ, బీజేపీ తాజాగా గవర్నర్ కు లేఖలు రాయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ క్రమంలోనే గవర్నర్ ఎటువైపు మొగ్గు చూపుతారన్న ప్రశ్న ఇప్పుడు అధికార - ప్రతిపక్ష నేతల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీ అపాయింట్  చేసిన గవర్నర్ హరిచందన్ కు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సైతం ఈ 3 రాజధానుల బిల్లు సహా సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించవద్దని లేఖ రాశారు. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు 6 పేజీల లేఖ రాశారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం గవర్నర్ ఆమోదిస్తారనే ఆశాభావంతో ఉంది. దీంతో చట్టం చేసి రాజధానిని విశాఖకు తరలించాలని యోచిస్తోంది.

ఈ బిల్లులకు మండలిలో ఆమోదం లభించలేదు. చర్చ జరగలేదు. నెలరోజులు పూర్తయినందున డీమ్డ్ టు బీ పాస్ చేసినట్లుగా జగన్ ప్రభుత్వం చెబుతోంది. సెలెక్ట్ కమిటీ అన్న అంశమే ఉత్పన్నం కాదని ప్రభుత్వం వాదిస్తోంది.

టీడీపీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ బిల్లులకు ఆమోదం తెలుపవద్దని లేఖలు రాయడంతో పరిస్థితి రసకందాయంలో పడింది. దీంతో గవర్నర్ హరిచందన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.

కాగా ఏపీలోని ఈ కీలక బిల్లులపై నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ హరిచందన్ చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్రం అభిప్రాయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా పరోక్షంగా పంపించనున్నారు. హైకోర్టులో విచారణ అడ్డంకి కాబోదని న్యాయ నిపుణులు కూడా తెలుపడంతో బిల్లుల ఆమోదంపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపైనే ఆసక్తి నెలకొంది.

కాగా గవర్నర్ ఆమోదిస్తే న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమవుతోంది. పలువురు బీజేపీ నేతలు ఇదే బాటలో ఉన్నట్టు తెలిసింది.
Tags:    

Similar News