ఏపీ ప్ర‌భుత్వం హామీ ఉన్న అప్పు.. 62,489 కోట్లు: కేంద్రం బ‌య‌ట పెట్టేసింది

Update: 2022-08-02 15:32 GMT
మింగ‌డానికి మెతుకు లేదు... మీసాల‌కు సంపెంగ నూనె.. అన్న‌ట్టుగా ఉంద‌ట‌.. ఏపీ స‌ర్కారు ప‌రిస్థితి!  ఈ విష‌యాన్ని కేంద్ర‌మే  స్ప‌ష్టం చేసింది. ఏపీప్ర‌భుత్వ‌మే .. అయిన కాడికి అప్పులు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాను అప్పులు చేయ‌డానికి ఉన్న అన్ని దారుల‌ను వినియోగించుకుంది.

దాదాపు 8 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసింద‌ని.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో తాజా విష‌యంపై కేంద్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అదేంటంటే.. ఏపీ ప్ర‌భుత్వం మ‌రికొన్ని సంస్థ‌లు చేసిన అప్పుల‌కు హామీ ఇచ్చింద‌ట‌. ఇదీ.. సంగ‌తి. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

గ‌త రెండేళ్ల‌లో ఏపీ ప్ర‌భుత్వం ఏకంగా రూ.62,489 కోట్ల అప్పుల‌కు హామీ ఉంద‌ని .. నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. ఇలా పూచీగా ఉన్న సంస్థ‌ల్లో కార్పొరేష‌న్లు, ప్ర‌బుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయ‌ట‌. 2020-21లో 46,719.42 కోట్ల రూపాయ‌లు 21-2022లో 18,770.54 కోట్ల రూపాయ‌లు మొత్తానికి ఏపీ ప్ర‌భుత్వం పూచీక‌త్తుగా ఉన్న‌ట్టు నిర్మ‌ల‌మ్మ లోక్‌స‌భ‌లో నే వెల్ల‌డించారు.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. కార్పొరేష‌న్ల పేరుతో గ‌త మూడేళ్ల‌లో స‌ర్కారు తీసుకున్న అప్పు.. రూ.29,337.24 కోట్లుగా ఉంద‌న్నారు. అయితే.. ఈ మొత్తాన్ని కార్పొరేష‌న్ల‌కు వినియోగిస్తారా.. లేక సొంతానికి వాడుకుంటారో.. మాత్రం చెప్ప‌లేదు.

మంగ‌ళ‌వారం అప్పు ఇదే..

మళ్లీ అధిక వడ్డీకి వైసీపీ ప్రభుత్వం  అప్పులు చేసింది. మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్  దగ్గర సెక్యూరిటీ బాండ్లు  వేలం వేసి రూ.2 వేల కోట్లు అప్పు తీసుకుంది. అందులో వెయ్యి కోట్లు 12 సంవత్సరాలకు 7.72 శాతం వడ్డీకి రుణం తీసుకోగా.. మరో వెయ్యి కోట్లు 20 ఏళ్లకు 7.82 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. కాగా 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రూ.28 వేల కోట్లు రుణంగా తీసుకువచ్చింది. ఈ ఏడాది ఎఫ్ఆర్‌బీఎం   పరిధిలో...ఇంకా రూ. 20 వేలకోట్లు మాత్రమే బాండ్ల వేలం ద్వారా సమీకరించే అవకాశం ఉంది.
Tags:    

Similar News