అంగ‌న్ వాడీల‌పై ఏపీ స‌ర్కారు పెద్ద నిర్ణ‌యం

Update: 2015-08-06 09:59 GMT
విభ‌జ‌న పుణ్య‌మా అని రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్యన పెద్ద పోటీనే న‌డుస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలోనూ.. జీతాల పెంపు విష‌యంలో ఎవ‌రు నిర్ణ‌యం తీసుకున్నా.. మిగిలిన వారు అంత‌కు మించి నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. రాజ‌కీయంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న ప‌రిస్థితులు కూడా ఇలాంటి నిర్ణ‌యాల‌కు కార‌ణంగా చెబుతున్నారు.

ఆ మ‌ధ్య‌న తెలంగాణ ప్ర‌భుత్వం అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు భారీగా వేత‌నాలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఏపీ సర్కారుపై ఒత్తిడి పెరిగింది. తెలంగాణ స‌ర్కారు త‌ర‌హాలోనే త‌మ జీతాలు పెంచాలంటూ అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల డిమాండ్లు తీవ్ర‌త పెరిగింది. విభ‌జ‌న పుణ్య‌మా అని ఇప్ప‌టికే ఖాళీ బొక్క‌సంతో ఉన్న ఏపీ స‌ర్కారు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి.

అలా అని మౌనంగా ఉండ‌లేని ప‌రిస్థితి. అంగ‌న్ వాడీల స‌మ‌స్య‌ల్ని సాకుగా చేసుకొని విప‌క్షాలు విరుచుకుప‌డాల‌న్న ఆలోచ‌నతో ఉన్న నేప‌థ్యంలో.. వాటికి ఆ అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో ఉన్న ఏపీ స‌ర్కారు తాజాగా ఒక భారీ నిర్ణ‌యాన్ని తీసుకుంది. తాజాగా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు వేత‌నాలు పెంచాలంటూ ఏపీ కేబినెట్ స‌బ్ క‌మిటీ సిఫార్పు చేసింది. ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల నేతృత్వంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కూ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు రూ.4,200 ఇస్తున్న జీతాన్ని ఇక‌పై రూ.7100కు పెంచ‌నున్నారు. ఇక‌.. హెల్ప‌ర్ల‌కు రూ.2400 ఉన్న వేత‌నాన్ని రూ.4600కు పెంచాల‌ని నిర్ణ‌యించారు. మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చే వేత‌నాల్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వారికి రూ.2950 ఇస్తుండ‌గా.. దాన్ని రూ.4600 పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. జీతాల పెంపు కార‌ణంగా ఏపీ స‌ర్కారుపై రూ.315కోట్ల భారం ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.04 ల‌క్ష‌ల మంది అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు ల‌బ్థి చేకూర‌నుంది.
Tags:    

Similar News