పోలవరం నుంచి ఆ రెండు కంపెనీల్ని పంపేశారు!

Update: 2019-08-02 05:10 GMT
అధికారం చేపట్టిన నాటి నుంచి విలువైన ప్రజాధనాన్ని కాపాడేందుకు దేనికైనా సిద్ధం.. ఎంతకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు.. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

పోలవరం హెడ్ వర్క్స్ నుంచి తప్పుకోవాలంటూ నవయుగతోపాటు బీకెమ్ లకు టెర్మినేషన్ లెటర్స్ ను జారీ చేశారు. ఒప్పందం రద్దు కోసం పరస్పర అంగీకారాన్ని తెలియజేయటం కోసం 15 రోజుల్లో తమను కలవాల్సిందిగా కోరారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకలను తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన జగన్ కమిటీ.. సదరు కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టుసంస్థలకు సమాచారం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇదే విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ.. కేంద్ర జల్ శక్తి శాఖలకు లేఖను పంపింది. అదే సమయంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

విభజన చట్టం ప్రకారం కేంద్రం నూరు శాతం ఖర్చు భరించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే.. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. ఇందుకోసం కేంద్రం కోరినట్లుగా వ్యవహరించటంతో.. పోలవరం నిర్మాణ బాధ్యతల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించింది కేంద్రం. ఇదిలా ఉంటే .. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియక ముందే రూల్స్ కు భిన్నంగా అంచనా వ్యయాన్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం అప్పట్లో పలువురు తప్పుపట్టేలా చేసింది.

అంచనా వ్యయాన్ని 1331.91 కోట్లు పెంచేస్తూ.. 2016లో ఉత్తర్వులు జారీ చేసిన బాబు ప్రభుత్వం టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ ని అడ్డు పెట్టుకొని కమీషన్లు వసూలు చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పుల్లో మునిగిపోయిన ట్రాన్స్ ట్రాయ్ 2017లో దివాలా తీయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాలి.

ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని పెంచేశారు. రూల్స్ లో ఉన్న వెసులుబాటును అవకాశంగా మార్చుకొని 4.83 శాతం అధిక ధరకు టెండర్లు కట్టబెట్టారు. చూసేందుకు 4.83 శాతంగా కనిపించినప్పటికీ ప్రాజెక్టు వ్యయం ఎంత మేరకు పెరుగుతుందో తెలుసా? అక్షరాల రూ.3,220 కోట్లు ప్రాజెక్టు పనులు చేరుకున్నాయి. ఈ పనుల్ని నవయుగ కంపెనీకి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ జారీ చేసింది. ధీంతో ఈ ప్రాజెక్టు పనుల నుంచి నవయుగ తప్పుకోవాల్సిన పరిస్థితి.  బికామ్ కంపెనీ విషయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ కంపెనీని కూడా పనుల నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News