భూమి లేకుండానే ప్రాజెక్టు క‌ట్టేస్తున్న ఏపీ

Update: 2017-01-04 05:19 GMT

అప్ప‌ట్లో వ‌చ్చిన రాజావారి చేప‌ల చెరువు సినిమా గుర్తుండే ఉంటుంది. త‌న చెరువు కిడ్నాప్ అయిందంటూ పోసాని కృష్ణ‌ముర‌ళి ఫిర్యాదు చేస్తే...చెరువు ఎలా దొంగ‌లిస్తార‌ని అధికారులు ప్ర‌శ్నిస్తారు. అలా లేని చెరువు విష‌యంలో ఆ సినిమాలో స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇపుడు అలాగే అస‌లు భూమి లేకుండానే ఏపీలో ప్రాజెక్టు నిర్మాణం అవుతోంది. అది కూడా ఆషామాషీగా కాదు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుచే స్వ‌యంగా శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించేంత ప్ర‌తిష్టాత్మ‌క స్థాయిలో అది ముందుకు సాగుతోంది. ఇది గోదావరి నది ఎడమగట్టుపై ప్రతిపాదించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో జ‌రుగుతున్న వింత‌.

జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుచే పనుల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరింపచేయడానికి ఏర్పాట్లు చేసేశారు. అదీ ప్రాజెక్టు నిర్మాణం జరిగే చోట కాకుండా దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో. దూరం పెద్ద విష‌యం కాదు అనుకొని అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అయితే అసలు భూసేకరణే జరగకుండానే ప్రాజెక్టు నిర్మాణానికి ప‌నులు ప్రారంభించ‌డ‌మే మొత్తం ఎపిసోడ్‌ లో ట్విస్ట్‌. రూ.1637కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించిన అవసరమైన భూమిని సేకరించడానికి రెవెన్యూ అధికారులు సర్వే చేపడితే రైతులు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తున్నారు. దీంతో అధికారులు మధ్యే మార్గంగా భూమిని లీజు ప్రాతిపదికన సేకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇటు రెవెన్యూ - అటు జల వనరుల శాఖ అధికారులు రైతులతో చర్చించి - ఒప్పించడానికి చర్యలు చేపట్టినట్టు తెలిసింది. పైపులైను నిర్మాణానికి దాదాపు 240 ఎకరాల భూమి అవసరమని అంచనావేశారు. ఈ భూమికి పట్టిసీమ మాదిరిగా నష్టపరిహారం ఇవ్వాలంటే సరాసరి ఎకరానికి రూ.12 లక్షలు చెల్లించినా సుమారు రూ.290 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశముంది. పైపులైన్ నిర్మాణం వరకు భూమిని లీజుకు తీసుకుని ఆపై భూమిని రైతులకు అప్పగించే ప్రాతిపదికన తీసుకునేందుకు కసరత్తు చేపట్టినట్టు తెలిసింది. మొత్తం మీద అవసరమైన భూమి సిద్ధం కాకుండానే ఆదరాబాదరా ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన శిలాఫలకాన్ని వేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే క్షేత్ర‌స్థాయిలో రైతులు మాత్రం తీవ్రంగా ప్ర‌తిఘటిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు పోలవరం కోసం - మరో వైపు పుష్కర ఎత్తిపోతల పథకం కోసం భూములను పోగొట్టుకున్నామని, ఇపుడు మిగిలిన భూమిని పురుషోత్తపట్నం కోసం సేకరిస్తే సహించేదిలేదని రైతులు ప్రతిఘటిస్తున్నారు. దీంతో ఈప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. బాలారిష్టాలు దాటకుండానే శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం, పుష్కర పథకాల్లో ఎకరా భూమికి రూ.1.5లక్షల నుండి రూ.2.5లక్షల వరకు పరిహారాన్ని అందించారు. ఎకరా భూమి పరిహారంతో కొందరు రైతులు పదేసి సెంట్ల భూమిని మాత్రమే కొనుగోలు చేసుకోగలిగారు. ఇప్పుడు ఆ మిగిలిన పదిసెంట్ల భూమిని కూడా పురుషోత్తపట్నం కోసం లాగేసుకుంటే తాము ఎలా బతకాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల రైతులు భూమిలేని నిరుపేదలుగా మారుతున్నారని, ప్రాజెక్టుల వల్ల బాగుపడాలని ఆశిస్తే ఉన్నభూమినే కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద భూములిచ్చేది లేదని రైతులు ఆందోళనలో మునిగిన నేపథ్యంలో మరోవైపు శంకుస్థాపన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News