2006 నవంబరు.. ఏపీ సర్కారు వర్సెస్ మార్గదర్శి.. 2022 నవంబరు.. ఏపీ సర్కారు వర్సెస్ మార్గదర్శి

Update: 2022-11-18 11:33 GMT
ఒకటే అంశం.. ఒకటే పరిస్థితులు.. దాదాపు ఒకటే ప్రభుత్వం.. ఒకటే తీరున వ్యవహారం.. అదేం చిత్రమో కాని.. ఓ విషయంలో అప్పుడు ఇప్పడు ఒకేలా జరుగుతోంది. అదేమంటే ఏపీ సర్కారు వర్సెస్ మార్గదర్శి చిట్ ఫండ్స్. ఇక్కడో చిన్న మార్పు ఏమంటే నాడు ఏపీ సర్కారు సారథి స్థానంలో తండ్రి ఉండగా.. నేడు ఆయన కుమారుడు ఉన్నారు. అయితే, ఉద్దేశాలు-ప్రయత్నాలు మాత్రం ఇరువైపుల నుంచి ఒకేలా ఉన్నాయి.

నాడు ఏం జరిగింది..? 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో ఉమ్మడి ఏపీలో పగ్గాలు చేపట్టింది. వైఎస్ సీఎంగా పలు పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణమే లక్ష్యంగా భగీరథ ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే, అదే సమయంలో లోపాలు, లోటుపాట్లు చోటుచేసుకునేవి. దీనిని ఓ మీడియా సంస్థగా వెలుగులోకి తెచ్చేది ఈనాడు.

కానీ, ఆ సంస్థ ప్రయత్నాల వెనుక చంద్రబాబు ప్రయోజనం దాగి ఉందంటూ వైఎస్ మండిపడేవారు. అంతకుముందు ఏ ముఖ్యమంత్రీ తలపెట్టని విధంగా ఈనాడుపై నేరుగానే దాడికి దిగేవారు. అయినా, ఆ మీడియా ఎంతకూ తగ్గకపోవడంతో ఆర్థిక మూల స్తంభమైన మార్గదర్శిని లేవనెత్తారు. మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేత ఆరోపణలు చేయించారు. తదుపరి పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇక నాడు ఉండవల్లి ఆరోపణలు చేసిన సందర్భం 2006లో అటుఇటుగా నవంబరు.

ఇప్పుడేం జరుగుతోంది? ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. భౌతికంగా ఉనికిలో ఉన్న ఏపీలో వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. మళ్లీ మునుపటి పరిస్థితులే. అటు ఏపీ సర్కారు ఇటు ఈనాడు. ప్రజా సమస్యలు, ఇతర రాజకీయ అంశాలను తనదైన శైలిలో లేవనెత్తుతూ వస్తున్న ఈనాడును ఏపీ సర్కారు కొంతకాలంగా ఉపేక్షించింది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక కథనాలు పెరుగుతుండడంతో మళ్లీ పాత వ్యూహానికి పదునుపెట్టింది. ఈనాడు ఆర్థిక స్తంభమైన మార్గదర్శిలో అక్రమాలు అంటూ కొన్ని రోజులుగా ఏపీ అధికారులు ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

ప్రస్తుతం 2022 నవంబరు. నాడు తొలిసారిగా మార్గదర్శి మీద ఉండవల్లి ఆరోపణలకు దిగినదీ నవంబరులోనే. నేడూ అదే నెల. కాగా, నాడు ఆరోపణలను తన మీడియా ద్వారా ఖండించినట్లే నేడూ ఈనాడు ఖండిస్తోంది. మరోవైపు నాడు ఆరోపణలు చేసిన ఉండవల్లి.. రెండు దఫాలుగా ఎన్నికల్లో పోటీనే చేయడం లేదు. మాజీ ఎంపీగా మిగిలిపోయిన ఆయన తరచూ మీడియా ముందుకు వస్తూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, మధ్యలో ఏపీ ప్రభుత్వం పట్టు విడిచినా.. ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం మార్గదర్శి కేసును వదల్లేదు. అదే..16 ఏళ్ల అనతరం నాటి అనుభవాన్ని మళ్లీ గుర్తుకుతెచ్చేలా చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News