ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్: పరిషత్ ఎన్నికలు కుదరవు

Update: 2021-03-23 07:41 GMT
ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటీషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు చెక్ పడింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డకూ ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు తీర్పుతో పరిషత్‌ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో లేదని తేలిపోగా.. నిమ్మగడ్డ రిటైర్మెంట్‌కూ లైన్‌ క్లియర్‌ అయినట్లయింది. కొత్త ఎస్ఈసీ ఎన్నిక, ఆయన నియామకం.. బాధ్యతల తర్వాతే పరిషత్ పోరు జరుగనుంది. న్యాయచిక్కులు తొలగాల్సి ఉంది.

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేడిలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని..వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని జగన్ సర్కార్ భావించింది. రెండు ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఒత్తిడి తెచ్చింది. అయితే ఆయన ఈనెల 31తో రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తి చూపకపోవడంతో హైకోర్టుకు ఎక్కారు.న్యాయచిక్కులు ఉండడం.. విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ పరిషత్ ఎన్నికల నిర్వహణపై వెనక్కితగ్గారు.

పరిషత్ పోరు నిర్వహించకుండా సెలవుపై వెళ్తున్నారంటూ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేయించిన పిటీషన్లకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

ఏపీలో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు తక్షణం నిర్వహించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వలేమని పిటీషన్లపై విచారించిన హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీని ఆదేశించలేమని అంది. ఈ మేరకు నిమ్మగడ్డకు, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక కొత్త ఎస్ఈసీ సారథ్యంలోనే ఎన్నికల నిర్వహణ జరుగనుంది.
Tags:    

Similar News