ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంపై ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

Update: 2022-10-05 06:34 GMT
ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంపై ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ప్రాథమిక హక్కు కాదని తేల్చిచెప్పింది. అది కేవ‌లం చట్టబద్ధ హక్కు మాత్రమేనని స్ప‌ష్టం చేసింది. నామినేషన్ ను తిరస్కరించ‌డం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వెల్ల‌డించింది.

నామినేషన్ ను తిర‌స్క‌రిస్తే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం కుద‌ర‌ద‌ని తెలిపింది. దానికి విచారణార్హత ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఏపీ సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఎన్నికల్లో తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రెవెన్యూ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ వాసుదేవరావు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టును ఆయ‌న అభ్య‌ర్థించారు.

పిటిష‌న‌ర్‌ తరఫు న్యాయవాది తాతా సింగయ్యగౌడ్‌ వాదనలు వినిపిస్తూ.. సంఘం కార్యదర్శి పోస్టుకు పిటిషనర్‌ నామినేషన్‌ దాఖలు చేశారని తెలిపారు. అన్నీ పక్కాగా ఉన్నా ఓటర్ల జాబితాలోని సీరియల్‌ నంబర్‌తో పేరు సరిపోలడం లేదంటూ నామినేషన్‌ను తిరస్కరించారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీని ద్వారా పిటిషనర్‌ ప్రాథమిక హక్కులను హరించారని కోర్టుకు నివేదించారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వ్యక్తి నియామకం చెల్లదన్నారు. అతను సెక్షన్‌ ఆఫీసర్‌ కాదని, అసిస్టెంట్‌ సెక్రటరీగా పదోన్నతి పొందారని న్యాయ‌స్థానానికి పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది తాతా సింగ‌య్య నివేదించారు.  

ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని తెలిపారు. ఏపీ సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఏపీ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం కింద ఏర్పాటైందని గుర్తు చేశారు. అందువల్ల నామినేషన్‌ తిరస్కరణపై జిల్లా కోర్టులో మాత్ర‌మే సవాల్‌ చేయాలని చెప్పారు. ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

అసోసియేషన్‌ తరఫు న్యాయవాది అప్పారావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో కోర్టు జోక్యం త‌గ‌ద‌ని వాదించారు. ఫలితాల తరువాత జిల్లా కోర్టులో పిటిషన్‌ వేయడమే పిటిషనర్‌ ముందున్న మార్గమని తేల్చిచెప్పారు.

అంద‌రి వాద‌న‌లు విన్న హైకోర్టు ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ప్రాథమిక హక్కు కాదని తేల్చిచెప్పింది. అది కేవ‌లం చట్టబద్ధ హక్కు మాత్రమేనని స్ప‌ష్టం చేసింది. నామినేషన్ ను తిరస్కరించ‌డం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వెల్ల‌డించింది.

ప్రస్తుత కేసులో పిటిషనర్‌ ఏపీ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం కింద జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చునంది. ఎన్నికల అధికారి నియామకాన్ని కూడా అక్కడే సవాల్‌ చేసుకోవాలని తెలిపింది. ఆ పిటిషన్‌ను ఆరు నెలల్లో పరిష్కరించాలని జిల్లా కోర్టును ఆదేశిస్తూ న్యాయ‌మూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీర్పు చెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News