కర్నూలులో హైకోర్టును నిర్మించేది ఇక్కడే!

Update: 2022-12-06 05:29 GMT
న్యాయ రాజధాని మాహక్కు అని, ఉయ్‌ వాంట్‌ జ్యుడిషియల్‌ కేపిటల్‌ అని రాయలసీమ గర్జన సభలో వక్తలు డిమాండ్‌ చేశారు. న్యాయ రాజధానిని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన సభ విజయవంతమైంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మూడు రాజధానుల్లో భాగంగా న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలిస్తారు.

అయితే మూడు రాజధానుల చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు మూడు రాజధానుల పిటిషన్లను విచారిస్తోంది. తదుపరి విచారణ జనవరి 31న జరగనుంది. సుప్రీంకోర్టులో జగన్‌ ప్రభుత్వం ఆశించింది ఇంకా దక్కలేదు. ఆరు నెలల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

అయితే సుప్రీంకోర్టు నుంచి మూడు రాజధానులకు అనుకూలంగా గ్రీన్‌సిగ్నల్‌ రానప్పటికీ జగన్‌ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకే వెళ్తోంది. మూడు రాజధానులకు అనుకూలంగా సభలు, సమావేశాలు, గర్జనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా డిసెంబర్‌ 5న కర్నూలులో రాయలసీమ గర్జన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్‌ బాషా తదితరులు న్యాయ రాజధాని రాయలసీమ హక్కు అని నినదించారు.

కర్నూలులోని జగన్నాథగుట్టపై హైకోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు తేల్చిచెప్పడం విశేషం. ఇంకా సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనప్పటికీ అప్పుడే హైకోర్టు నిర్మించనున్న స్థలాన్ని కూడా వైసీపీ నేతలు సిద్ధం చేయడం గమనార్హం.

కర్నూలు పట్టణానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం జగన్నాథగుట్ట వద్ద 10 ఎకరాల స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తుందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు.

సుందరమైన కొండతో ఉన్న జగన్నాథగుట్ట ప్రసిద్ధ శివాలయానికి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ లింగాన్ని పంచ పాండవుల్లో ఒకరైన భీముడు ప్రతిష్టించాడని నమ్ముతారు.

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన రాయలసీమ గర్జన ర్యాలీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘జగన్నాథగుట్ట అన్ని వైపుల నుండి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది హైకోర్టుకు అనువైన ప్రదేశం’’ అని తెలిపారు.

రాయలసీమ యువత, రైతుల ఆకాంక్షలకు హైకోర్టు ప్రతీకగా నిలుస్తుందని, ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని బుగ్గన అన్నారు.

మరోవైపు వచ్చే ఉగాది పండుగ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రతిపాదిత కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంకు తరలించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
Tags:    

Similar News