చంద్రబాబు భద్రతపై స్పందించిన హోంమంత్రి

Update: 2019-06-29 04:12 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతను తగ్గించి వేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో వారు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపట్టిందని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆరోపిస్తూ ఉన్నారు.

ఇటీవలే చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రభుత్వం భధ్రతను తగ్గించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటి భద్రత ఇప్పుడు చంద్రబాబుకు లేదు. అలాగే లోకేష్ కు కూడా భద్రతను తగ్గించారు. ఇక చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు కోడలు బ్రహ్మణికి ప్రభుత్వం పూర్తిగా భద్రతను రద్దు చేసింది.

ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అగ్గిమీద గుగ్గిలం అవుతూ ఉంది.గతంలో తాము నాటి ప్రధాని మన్మోహన్ ను కోరి చంద్రబాబుకు భద్రతా ఏర్పాట్లు చేయించుకున్నట్టుగా వారు గుర్తు చేస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని చంద్రబాబు కూడా అంటున్నారు.

ఈ క్రమంలో ఈ అంశంపై స్పందించారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. అంతా చట్ట ప్రకారమే అని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరి హోదాకు ఎంత భద్రత ఉండాలనే అంశంలో తాము చట్టాన్ని ఫాలో అవుతున్నట్టుగా ఆమె తేల్చి చెప్పారు. ఎవరికి ఎంత భద్రతను ఏర్పాటు చేయాలనే అంశం గురించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని.. ఆ కమిటీ నిర్ణయానికి కట్టుబడి చంద్రబాబుకు భద్రతను ఏర్పాటు చేసినట్టుగా ఆమె వివరించారు. చంద్రబాబుకు అదనపు భద్రత కావాలనుకుంటే..కమిటీకి విన్నవించుకోవచ్చని ఆమె ప్రకటించారు.
Tags:    

Similar News