వాట్ ఏ గ్రేట్ ప్రైడ్.. అత్యధిక అప్పులున్న టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ

Update: 2022-06-18 01:30 GMT
రాష్ట్ర విభజన ఏపీకి ఒక శాపంగా మారటం తెలిసిందే. విభజనతో భారీగా ఆదాయాన్ని కోల్పోయేలా చేసిన వైనం ఒక ఎత్తు అయితే.. ఏపీని పాలించిన.. పాలిస్తున్న ప్రభుత్వాల తీరు రాష్ట్ర ఇమేజ్ ను దారుణంగా మార్చేస్తోంది. ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర ప్రజలకు కించిత్ బాధ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల ఒక నివేదిక విడుదల చేసింది. అందులో దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న టాప్ 10 రాష్ట్రాల వివరాల్ని వెల్లడించింది.

అందులో ఒక రాష్ట్రంగా ఏపీ ఉండటం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ.. ఆర్థిక లోటు పరిమితులను ఏపీ దాటేసినట్లు పేర్కొంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే 25 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ పెసిటిలీ.. 21 రోజుల పాటు చేబదుళ్లలోకి వెళ్లినట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితి ఉన్న రాష్ట్రాల్లో మణిపూర్.. నాగాలాండ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.

అంతేకాదు.. ఇదే నెలలో బహిరంగ మార్కెట్ నుంచి ఏపీ రూ.4వేల కోట్ల అప్పు తీసుకోగా.. తెలంగాణ తీసుకోలేదు. అయితే.. తెలంగాణ మాత్రం చేబదుళ్లు.. ఓడీ.. ప్రత్యేక డ్రాయింగ్ ఫెసిలిటీ మీద ఆధారపడింది. ఏపీ మాత్రం రుణంతో పాటు మిగిలిన వాటిని వాడేయటం గమనార్హం. 2021-22 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం చూస్తే ఏపీ ఆదాయంలో 14 శాతం చేసిన అప్పుల వడ్డీలకు వెళుతుంది. ఈ లెక్కన అసలును చెల్లించాలంటే పరిస్థితి ఏమిటన్న ఆలోచనే వణుకు తెప్పించేలా ఉంటుంది.

ఉచిత పథకాల కోసం భారీగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో పంజాబ్ అగ్రస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ఏపీ నిలచింది. ఏపీలో అమలు చేసే ఉచిత పథకాల కోసం ఖర్చు చేసే మొత్తం.. రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయం (కేంద్రం ఇచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా)లో 30.3 శాతం కావటం గమనార్హం.  గత మేలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఏపీ.. మహారాష్ట్ర.. తెలంగాణ.. పశ్చిమ బెంగాల్ లో 8 శాతానికి మించినట్లు పేర్కొంది.

బడ్జెటేతర రుణాల కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల నిష్పత్తి జీఎస్ డీపీలో 4.6 శాతం ఉండగా.. తాజాగా 9 శాతానికి చేరింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా 9 శాతం గ్యారంటీలు ఇవ్వలేదు. ఇలాంటి ఘనతలన్ని తాము ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాల కారణమన్న విషయాన్ని ఆంధ్రోళ్లు ఎప్పటికి అర్థం చేసుకొని అవగాహనలోకి తెచ్చుకుంటారో? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారిపోతున్న వేళ.. అంతిమంగా ఆ భారాన్ని మోయాల్సింది తామేనన్న పచ్చి నిజం ఏపీ ప్రజలకు ఎప్పటికి అర్థమవుతుందో?
Tags:    

Similar News