ఏపీ గురించి ఎవరికి తెలియని 'ఏసీ' నిజం

Update: 2022-11-21 23:30 GMT
ఒకప్పుడు ఇంట్లో ఏసీ ఉందంటే వారెంతో రిచ్ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. మధ్యతరగతి వారు సైతం ఏసీలు కొనేస్తున్నారు. అంతేనా.. ఒకప్పుడు ఇంట్లో ఏసీ ఉంటేనే గొప్ప. ఇప్పుడు ఇంటికి రెండు మూడు ఏసీలు ఉంటున్న పరిస్థితి. మరి.. ఈ ఏసీలను ఎక్కడ తయారు చేస్తారు? ఎవరు ఉత్పత్తి చేస్తారు? అన్న ప్రశ్న వేసుకుంటే.. దానికి వచ్చే సమాధానం వావ్ అనుకునేలా ఉంటుంది.

దీనికి కారణం.. దేశంలో తయారయ్యే ఏసీల్లో కీలక భాగస్వామ్యం ఏపీనే. ఆ మాటకు వచ్చే రానున్న రోజుల్లో దేశంలో వినియోగించే ప్రతి రెండు ఏసీల్లో ఒకటి ఏపీలో తయారు చేసిందే అవుతుంది. అంతే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగించే ఏసీల్లో.. 80 శాతం ఏపీలో తయారుచేసినవే కావటం గమనార్హం.

ఏపీ గురించి మిగిలిన వారే కాదు.. ఆంధ్రోళ్లకు కూడా పెద్దగా తెలీని విషయాలు ఉన్నాయి. ఇప్పటికే సెల్ ఫోన్లు.. కార్ల తయారీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఏపీ.. ఏసీల ఉత్పత్తిలో దూసుకెళ్లనుంది. ఇందుకు తగ్గట్లే ఏపీ ప్రభుత్వం కూడా ప్లాన్ చేసింది. నెల్లూరు దగ్గర్లోని శ్రీసిటీ సెజ్ లో ఏసీల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. దేశంలోనే అత్యుత్తమ ఏసీలు తయారు చేసే సంస్థలన్ని శ్రీ సిటీలో కొలువై ఉండటం గమనార్హం.

ఇప్పటికే శ్రీసిటీలో డైకిన్.. బ్లూ స్టార్.. హావెల్స్.. పానాసోనిక్.. యాంబర్.. ఈసాక్ లాంటి కంపెనీలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్క డైకిన్ సంస్థనే త్వరలో ఏటా 10 లక్షల ఏసీల్ని తయారు చేసేలా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశలో 15 లక్షల ఏసీలు తయారు చేయనున్నారు.

ఇక.. బ్లూ స్టార్ ఏడాదికి 12 లక్షల ఏసీల్ని తయారు చేసేలా యూనిట్ ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఏడాదిలో 75 లక్షల ఏసీలు (ఇంటికి ఉపయోగించేవి) అమ్ముడు అవుతుంటే.. అందులో 50 లక్షలకు పైగా ఏసీలో   ఏపీలోనే తయారు చేస్తున్నారు.

అంతేకాదు.. ఏసీల ఉత్పత్తి కోసం పలు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అతి త్వరలోనే.. ఏసీ తయారీకి హబ్ గా ఏపీ మారనుందని చెప్పాలి. ఆంధ్రోడికి ఇంతకంటే ఆనందాన్ని కలిగించే అంశం ఇంకేం ఉంటుంది చెప్పండి?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News