ఆ మెసేజులు.. జీఎపీఎఫ్ సబ్‌స్క్రిప్షన్ సందేశాలేనా?

Update: 2022-07-01 05:30 GMT
కొద్ది రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ ఉద్యోగులకు సంబంధించిన 800 కోట్ల రూపాయ‌ల‌ జీపీఎఫ్ నిధుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. చాలామంది ప్ర‌భుత్వ ఉద్యోగాల జీపీఎఫ్ ఖాతాల నుంచి డ‌బ్బులు మాయం కావ‌డంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న చెందారు. ఉద్యోగ సంఘాల నేత‌లు స‌చివాల‌యంలో ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి ఈ విష‌య‌మై ఆరా తీశారు.

అయితే సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే ఉద్యో్గుల ఖాతాల నుంచి జీపీఎఫ్ న‌గ‌దు మాయ‌మై ఉండొచ్చ‌ని అధికారులు వారికి తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లో విచార‌ణ చేస్తున్నామ‌ని.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని.. ఆ న‌గ‌దు వెన‌క్కి వ‌స్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు కొంచెం శాంతించాయి.

కాగా, చాలా మంది ఉద్యోగులకు జూన్ 30న‌ ఏజీ కార్యాలయం నుంచి సందేశాలు వ‌చ్చాయి. దీంతో మ‌రోమారు ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌య్యారు. అయితే ఇవి 2022 మార్చికి చెందిన జీపీఎఫ్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ఎస్‌ఎంఎస్‌లు అని దీనిపై ఎవ్వరూ ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు. ఈ ఎస్‌ఎంఎస్‌లు కేవలం మార్చి-2022 నెలకు సంబందించిన నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ పోస్టింగ్‌ గురించి మాత్రమేనని ఆయ‌న చెబుతున్నారు.

మార్చి నెల అంతానికి ప్రీవియస్‌ బ్యాలెన్స్‌ అంటే 31 మార్చి 2022 వరకు సదరు ఉద్యోగి చెల్లించిన మొత్తం చూపించడం జరిగిందే తప్ప అది ముగింపు బ్యాలెన్స్‌ కాదని వివ‌రించారు. ప్రస్తుతం ఉద్యోగులకు 2021-22 సంవత్సరం జీపీఎఫ్‌ అకౌంట్ స్లిప్‌లలో ఒకటి ఏప్రిల్‌ 2022 నాటికి వారు కట్టిన మొత్తం, సబ్‌స్క్రిప్షన్‌, వడ్డీతో కలిపి ముగింపు బ్యాలెన్స్‌ను చూపించారని బొప్ప‌రాజు వెంకటేశ్వ‌ర్లు చెబుతున్నారు.

ఈ సబ్‌స్క్రిప్షన్ మెసేజుల వ‌ల్ల‌ ఉద్యోగికీ ఎలాంటి నష్టం జరగలేదని ఉద్యోగ సంఘాల నేత బొప్ప‌రాజు పేర్కొంటున్నారు. 2021-22 జీపీఎఫ్‌ స్లిప్‌లు అందుబాటులో ఉంచక ముందే ఈ మెసేజ్‌ ఏజీ కార్యాలయం నుంచి వచ్చి ఉంటే ఇంత తికమక ఉండేది కాదని ఏజీ కార్యాలయం అధికారులు తెలిపార‌ని అంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో (2021-2022) ఉన్న వడ్డీతో కూడిన ముగింపు మొత్తం యధావిధిగా ఉంటుందని వివ‌రిస్తున్నారు.

మ‌రోవైపు సాధార‌ణ ఉద్యోగులు మాత్రం ఈ మెసేజుల‌తో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే జీపీఎఫ్ నిధులు త‌మ ఖాతాల నుంచి క‌ట్ అయ్యాయ‌య‌ని.. వాటి విష‌యం తేల‌కముందే మ‌ళ్లీ ఈ సబ్‌స్క్రిప్షన్ మెసేజుల గంద‌ర‌గోళం ఏమిట‌ని వారు వాపోతున్నార‌ని చెబుతున్నారు. ఉన్న‌తాధికారులు కూడా ఈ విష‌యంలో స‌రైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News