బ్రేకింగ్: ఏపీలో ఎన్నికలు వాయిదా.. కారణమిదే

Update: 2020-03-15 06:06 GMT
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఏపీలో పంచాయితీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంచలన ప్రకటన చేసింది.  ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తాజాగా తెలిపారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్లు - ఏకగ్రీవాలు పూర్తైన నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ ఏదీ రద్దు కాబోదని.. ఇక్కడి నుంచే తర్వాత ఎన్నికలు కొనసాగిస్తామని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.  సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఏపీలో పంచాయితీ ఎన్నికలను మార్చి 27 - 29 తేదీల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీటీసీ - జడ్పీటీసీ నామినేషన్లు కూడా వేసేశారు. అయితే కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిందని.. సంప్రదింపులు జరిపాక ప్రజారోగ్యం - ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

ఇక ఎంపీటీసీ  - జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు - దారుణాలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. గుంటూరు జిల్లా మాచర్ల - చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలపై ఈసీ చర్యలు తీసుకుంది. గూంటురు - చిత్తూరు కలెక్టర్ - ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. వీరి స్థానంలో వేరే అధికారులను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాచర్ల సీఐ అల్లర్లు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై అతడిని సస్పెండ్ చేసింది. అవసరమైతే కొత్త షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలను సజావుగా నిర్ణయిస్తామని ఈసీ కమిషన్ తెలిపారు.



Tags:    

Similar News