అమ‌రావ‌తి రైతులు కాదు.. రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్లు: ఏపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

Update: 2022-09-15 16:06 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని కోరుతూ రాజ‌ధాని రైతులు గుంటూరు జిల్లా అమ‌రావ‌తి ప్రాంతంలోని వెంక‌ట పాలెం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు మ‌హాపాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హాపాద‌యాత్ర‌కు రైతులు.. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు అని పేరుపెట్టారు. రాజ‌ధాని రైతుల యాత్ర ప్ర‌స్తుతం బాప‌ట్ల జిల్లాలోకి ప్ర‌వేశించింది.

కాగా రైతుల పాద‌యాత్ర‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం, వైఎస్సార్సీపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం మొద‌ట అనుమ‌తి నిరాక‌రించింది. అయితే రైతులు హైకోర్టును ఆశ్ర‌యించి అనుమ‌తి తెచ్చుకున్నారు. దీంతో ఓర్వ‌లేని వైఎస్సార్సీపీ నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాద‌యాత్ర‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉత్త‌రాంధ్రపై దాడిగా, దండ‌యాత్రగా ఆ మ‌హాపాద‌యాత్ర‌ను ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆ పాద‌యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని కూడా హెచ్చ‌రించారు. దీనికి చంద్ర‌బాబే బాధ్యుడు అవుతార‌ని కూడా హెచ్చ‌రించారు.

ఈ క్ర‌మంలో రైతుల పాద‌యాత్ర‌పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ నిప్పులు చెరిగారు. పాద‌యాత్ర చేస్తున్న‌వారు రైతులు కాద‌ని.. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్లు అని కాక రేపే వ్యాఖ్య‌లు చేశారు.

అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించే ముందు గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ముందుగానే త‌మ అనుచ‌రులు, స‌న్నిహితుల‌తో వంద‌ల ఎక‌రాల భూముల‌ను ఆ ప్రాంతంలో కొనిపించింద‌ని బుగ్గన రాజేంద్ర‌నాథ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2014లో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించేముందు టీడీపీ సానుభూతిప‌రులైన వ్యాపారులు అమ‌రావ‌తి ప్రాంతంలో వంద‌ల ఎక‌రాల భూముల‌ను కొనుగోలు చేశార‌ని బుగ్గన హాట్ కామెంట్స్ చేశారు. అమ‌రావ‌తి ప్రాంతంలోని చాలా గ్రామాల గురించి అస‌లు ఎవ‌రికీ పెద్ద అవ‌గాహ‌న లేద‌ని.. కానీ రైతుల నుంచి వారి భూముల‌ను పెద్ద మొత్తం కొనుగోలు చేయ‌డంలో మ‌త‌ల‌బు ఏంట‌ని బుగ్గ‌న ప్ర‌శ్నించారు.

ఇక రైతుల పేరిట నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర‌లో అస‌లు అమ‌రావ‌తి రైతులూ ఎవ‌రూ లేర‌న్నారు. స్థానికులు కూడా లేర‌ని చెప్పారు. ఆ పాదయాత్ర‌లో ఉన్న‌వారంతా హైద‌రాబాద్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ బ్యాచేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమరావతిపై కొందరు రియ‌ల్ ఎస్టేట‌ర్లు పెట్టుబడులు పెట్టారని బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ చెబుతున్నారు. ఈ వ్యాపారులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని పెట్టుబడులు పెడుతున్నార‌ని చెప్పారు.  ఈ రియ‌ల్ ఎస్టేట్ బ్యాచ్ బాగు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అక్క‌డ ప‌నులు ఎందుకు చేయాల‌ని బుగ్గ‌న నిల‌దీశారు.

కాగా ఇప్పుడు బుగ్గన రాజేంద్ర‌నాథ్ చేసిన తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై అమ‌రావ‌తి రైతులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News